వణికిన జపాన్‌

Trembling Japan– వరుసగా 21 భూకంపాలు
– తీరంలో సునామీ ప్రకంపనలు
– ఇండ్లు ధ్వంసం.. మౌలిక సదుపాయాలు ఛిన్నాభిన్నం
టోక్యో : నూతన సంవత్సరం రోజే జపాన్‌లో పెను విపత్తు సంభవించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ అలలు ఎగిసిపడ్డాయి. సునామీ రావడానికి ముందు ఇషికావా జిల్లాలోని నోటో ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించింది. దేశంలోని పలు ప్రాంతాలలో గంటన్నర వ్యవధిలోనే 4.0 తీవ్రతతో 21 భూకంపాలు సంభవించాయని రాయి టర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. సముద్రపు అలలు 1.2 మీటర్ల నుంచి ఐదు మీటర్ల ఎత్తు వరకూ ఎగిశాయి. భూకంపం ధాటికి అనేక చోట్ల మౌలిక సదుపాయాలు చిన్నాభిన్నమయ్యాయి. ప్రాణభయంతో ప్రజలు పరుగులు తీశారు. కోస్తా ప్రాంతాలైన ఇషికావా, నిల్‌గేట్‌, టొయామాలో వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం ధాటికి అనేక ఇండ్లు దెబ్బతిన్నాయి. వాజిమా నగరంలో 30 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. జాతీయ రహదారులను మూసేశారు. ప్రజలను ఖాళీగా ఉన్న మైదాన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భూకంపం ప్రభావం ఎక్కువగా పడిన ఇషికావా జిల్లాలో 36 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. సహాయ చర్యలలో పాల్గొనేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు నిమగమ య్యారు. వాజిమాకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని రాజధాని టోక్యోలో సైతం ఇళ్లు దెబ్బతిన్నాయి. అత్యంత వేగంతో నడిచే రైలు సర్వీసులను నిలిపివేశారు. ఇషికావా, టొయామా రాష్ట్రాలలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టెలికం, ఇంటర్నెట్‌ సేవలు కూడా నిలిచిపోయాయి. టొయామా, ఇషికావా నగరాలకు బయలుదేరిన విమానాలను వెనక్కి పంపారు. ఇషికావాలోని ఓ విమానాశ్రయాన్ని మూసివేశారు. అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. అయితే అణు విద్యుత్‌ ప్లాంట్లకు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
టీవీ ఛానల్స్‌ సాధారణ ప్రసారాలను నిలిపివేసి ప్రత్యేక బులెటిన్లు ప్రసారం చేశాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రధాని ఫురిమో కిషిండా కోరారు. మరింత విపత్తు సంభవించే అవకాశం ఉన్నదని, అందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరించారు. టీవీ స్క్రీన్లపై ‘రన్‌..’ అనే హెచ్చరిక సందేశాన్ని పదే పదే ప్రసారం చేశారు. భారతీయులకు అవసరమైన సమాచారం అందించేందుకు వీలుగా జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర కంట్రోల్‌ రూమును ఏర్పాటు చేసింది.
2011 మార్చిలో జపాన్‌ ఈశాన్య ప్రాంతంలో భూకంపం, సునామీ సంభవించాయి. ఆ తర్వాత తీవ్ర స్థాయిలో సునామీ హెచ్చరికలు జారీ కావడం ఇదే మొదటిసారి.
ఈ దేశాల్లో కూడా..
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రష్యా దేశాలు కూడా అప్రమత్తమై సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. తూర్పు నగరాలైన వ్లాదివోస్తాక్‌, నఖోడ్కాలకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. షకాలిన్‌ దీవికి పశ్చిమాన ఉన్న కోస్తా ప్రాంతం నుండి ప్రజలను ఖాళీ చేయించాల్సిందిగా రష్యా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని టాస్‌ వార్తా సంస్థ తెలిపింది. దక్షిణ కొరియా తూర్పు తీరంలో సునామీ అలలు 3.3 మీటర్ల ఎత్తున ఎగిశాయి. వీటి తాకిడి పెరగవచ్చునని అధికారులు తెలిపారు.

Spread the love