సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది, పది తరగతి విద్యార్థులకు త్రిభాషా విధా నాన్ని తప్పనిసరి చేసింది. జులై ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడిం చిం ది. సీబీఎస్‌ఈ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఆ మూడు భాషల్లో రెండు భారతీయ భాషలు ఉండాలి. మూడు భాషలను అధ్యయనం చేయాలి. ఇక పదో తరగతి విద్యార్థులకు ఒక ఊరట కల్పించింది. మూడో భాషకు బోర్డ్ ఎగ్జామ్ ఉండదని వెల్లడించింది. వారు భాషాధ్యయనంపైనే దృష్టి సారించేలా.. అనవసర ఒత్తిడి తగ్గించేందుకే ఈ ఏర్పాటు అని బోర్డ్ పేర్కొంది. ఆ పాఠ్యాంశానికి పాఠశాలల్లో చూపే ప్రతిభ ఆధారంగానే మార్కులు కేటాయిస్తారు. జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)లో ఈ త్రిభాషా విధానం భాగం . విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని ఎన్‌ఈపీ-2020 సిఫారసు చేస్తోంది. ఇందులో కచ్చితంగా రెండు భారతీయ భాషలుండాలి. ఈ ఫార్ములా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుంది. అయితే విద్యార్థులకు నేర్పాల్సిన భాషలేమిటన్నది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదే.
విదేశీ భాషల సంగతేంటి?
విద్యార్థులు మాధ్యమిక పాఠశాల స్థాయిలో భారతీయ భాషలు, ఆంగ్లంతోపాటు కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషలూ అభ్యసించవచ్చని ఎన్‌ఈపీ-2020 చెబుతోంది. అధిక శాతం పాఠశాలల్లో భాషా మాధ్యమంగా ఉన్న ఆంగ్లాన్ని విదేశీ భాషగా పరిగణిస్తారు. అందుకే ఈ భాషను ఎంచుకునే విద్యార్థులు రెండు భారతీయ భాషలను ఎంచుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగ నిర్దేశాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు బహుభాషా తత్వాన్ని ప్రోత్సహించి జాతీయ సమైక్యతను సాధించేందుకే ఈ విధానామని ఎన్‌ఈపీ నిబంధనలు చెప్తున్నాయి.కాగా.. గతంలో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలందరికీ హిందీ విధిగా బోధించాలని నిర్ణయించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. తర్వాత విమర్శలు రావడంతో త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.



