తైవాన్ అంశంపై మాటమార్చిన ట్రంప్
న్యూయార్క్: తైవాన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు కష్టమైన సమస్యేనని వెల్లడించారు. భౌగోళికం గా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందని , వారి స్వాతంత్య్రం కోసం మేం పోరాడబోమని వ్యాఖ్యానించారు. “తైవాన్ అంశం క్లిష్టమైన సమస్యే. ఈ ద్వీపం.. చైనాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో, అమెరికాకు మాత్రం 15 వేల కిలోమీటర్లకుపైగా దూరంలో ఉంది. ఎక్కువ దూరం కావడంతో మేం వేగంగా స్పందించడం కష్టమే. చైనా చాలా శక్తిమంతమైన, పెద్ద దేశం. ఉద్రిక్తతల విషయంలో చైనా, తైవాన్‌లు సంయమనం పాటించాలి” అని ఓ వార్తాసంస్థతో ట్రంప్ అన్నారు. వారి స్వాతంత్య్ర ఆకాంక్షల కోసం అంతదూరం ప్రయాణించి మేం యుద్ధం చేయాలని అనుకోవడం లేదన్నారు. చైనా పర్యటన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే.. అమెరికా-చైనా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని ట్రంప్‌నకు జిన్‌పింగ్ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అమెరికా- చైనాలు భాగస్వామ్య దేశాలుగా ఉండాలే తప్పా… ప్రత్యర్థులుగా కాదని జిన్‌పింగ్ పేర్కొనడం గమనార్హం.



