పనికిరాని ప్రొటోకాల్‌తో ఇబ్బంది పెట్టారు..

With a useless protocol Troubled..– ఎవరికి వారే యమునా తీరే…
– తాజా మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్‌
– అధిష్టానాన్ని..కార్యకర్తలు కలవకుండా అడ్డుకున్నారంటూ ఆగ్రహం
– నిజామాబాద్‌ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ హితవు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన నన్నే పనికిరాని ప్రొటోకాల్‌తో ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య సమన్వయమే లేదు. ఒకరికి తెలియకుండా ఇంకొకరు తమ తమ కోటరీల వారీగా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఈ రకంగా ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వ్యవహరించి, పార్టీకి తీవ్ర నష్టం కలిగించారు…’ అంటూ నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలోని తాజా మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్‌ అయ్యారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిజామాబాద్‌ పార్లమెంటు స్థానంపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అధిష్టానాన్ని… కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు జిల్లాకు వెళితే అడ్డంకులు సష్టించారని వాపోయారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడానికి గల కారణాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆమె హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యేలు వారి వారి సొంత కార్యకర్తలకే ప్రభుత్వ పథకాల పథకాలు అందేలా చూశారనీ, దీంతో పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందంటూ వాపోయారు. దళిత బంధు పథకాన్ని గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేస్తే… ఎస్సీలందరికీ న్యాయం జరిగేదని స్పష్టం చేశారు. అలా చేసి ఉంటే వారందరూ ఎన్నికల్లో గులాబీ జెండాకు అండగా నిలిచేవారని తెలిపారు. కానీ ఆ పథకాన్ని కొందరికే ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్న వారు పార్టీకి వ్యతిరేకమై, తీవ్ర నష్టం చేకూర్చారని పేర్కొన్నారు. అందువల్ల మాజీ ఎమ్మెల్యేలు ఇకనైనా తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని హితవు పలికారు. వారు మారకపోతే అధిష్టానం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నేతలు సమిష్టిగా పని చేయాలని కవిత సూచించారు.
నేడు ‘ఖమ్మం’పై సమీక్ష
పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం ఎంపీ స్థానంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ భేటికీ బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతోపాటు అక్కడి తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తదితరులు హాజరుకానున్నారు.

Spread the love