Thursday, July 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫార్మా భూముల్లో 
అలజడి

ఫార్మా భూముల్లో 
అలజడి

- Advertisement -

రైతుల పంటలు ధ్వంసం
భావోద్వేగానికి గురైన రైతులు
కోర్టు ధిక్కరణకు పాల్పడిన రెవెన్యూ,పోలీస్ అధికారులు
రైతులను బలవంతంగా భూముల నుంచి వెళ్ళగొట్టిన వైనం
భూములు గుంజుకోవద్దని అధికారుల కాళ్ళు మొక్కిన బాధిత రైతులు


నవతెలంగాణ-యాచారం
రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని ఫార్మాసిటీ భూముల్లో అలజడి మొదలైంది. కోర్టు ఆర్డర్ ఉన్నా.. ఫార్మాసిటీ భూముల్లో వేసిన పంటలను జేసీబీల సాయంతో బుధవారం బలవంతంగా రెవెన్యూ, పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. దాంతో ఆరుగాలం కష్టపడి వేసిన పంటను తొలగించడంతో రైతులంతా భావోద్వేగానికి గురయ్యారు. పంటలను తొలగించొద్దని జేసీబీలకు రైతులంతా అడ్డం పడ్డారు. భూములు గుంజుకోవద్దని బాధిత రైతులు రెవెన్యూ అధికారుల కాళ్ళు మొక్కినా ఆగకుండా పోలీసులను అడ్డుపెట్టి బలవంతంగా పంటలను తొలగించారు. అధికారుల తీరుకు నిరసనగా బాధిత రైతులు ఆందోళనకు దిగారు. దాంతో ఫార్మాసిటీ భూముల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ, పోలీసు అధికారులను బాధిత రైతులు నిలదీశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం మెడిపల్లి, కుర్మిద్దలో ఫార్మాసిటీ భూములు ఉన్నాయి.

ఈ భూములపై కోర్టులో కేసు నడుస్తోంది. రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని చాలా సార్లు చెప్పారు. ఈ క్రమంలోనే మెడిపల్లి, కుర్మిద్దకు చెందిన రైతులు సుమారు 50 ఎకరాల్లో పత్తి, జొన్న సాగు చేశారు. అయితే ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి పూనుకుంది. ఇందులో భాగంగా బుధవారం రెవెన్యూ అధికారులు పంట భూముల్లోకి వెళ్లారు. రైతులు సాగు చేసిన పత్తి, జొన్న పంటలను జేసీబీలతో పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే అధికారుల చర్యలను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసుల పహారాలో రెవెన్యూ అధికారులు పంటలను ధ్వంసం చేశారు. జేసీబీలను అడ్డుకున్న రైతులను హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌‌కు తరలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములను గుంజుకొని తమ పొట్ట మీద కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -