కమిటీలు లేక 13 జిల్లాలకే మంజూరైన నిధులు
మిగతా జిల్లాల్లో తప్పని ఎదురుచూపులు
ప్రత్యామ్నాయ పంటలు, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, నూతన సాగు విధానాలపై..అవగాహన కల్పించడంలో ఈ కమిటీలే కీలకం
పలు చోట్ల ఎమ్మెల్యేల వద్ద పెండింగ్‌లో ఉన్న జాబితాలు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రత్యామ్నాయ పంటల సాగు, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, నేల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించడంలో ‘అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ’ (ఆత్మ)ది కీలక పాత్ర. రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ చుట్టుపక్కల రైతులు సైతం సాగులో కొత్త విధానాలు అవలంబించేలా ‘ఆత్మ’ ప్రోత్సహిస్తుంటుంది. సాగురంగంలో అంతటి కీలక పాత్ర పోషిస్తున్న ‘ఆత్మ’కు.. కమిటీలే కీలకం. కమిటీలు ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుదల చేస్తుంటాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు గాను ప్రస్తుతం 13 జిల్లాల్లో కమిటీల ఎన్నిక పూర్తి కావడంతో ఆయా జిల్లాలకే నిధులు విడుదలయ్యాయి. మిగతా జిల్లాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కమిటీలో సభ్యులను వ్యవసాయశాఖ ఏడీఏ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ‘అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ’ (ఆత్మ) వ్యవసాయశాఖకు అనుబంధంగా పని చేస్తుంటుంది. ప్రధానంగా నేల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, విత్తనాల కొనుగోలు, సేంద్రియ, ప్రకృతి సాగు విధానాలు, పంటల మార్పిడిపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహిస్తూ వారిని చైతన్యవంతం చేయడం కోసం కీలకంగా వ్యవహ రిస్తుంటుంది. కొన్నేండ్లుగా నిధులు లేక జనసత్వాలు కోల్పోగా.. తాజాగా జీవం వచ్చినట్టయింది. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చొప్పున నిధులు విడుదల చేస్తుండటంతో.. రైతులకు శిక్షణ, పంట సాగు డెమో, కిసాన్ మేళా తదితరాలు నిర్వహించేందుకు నిధులు వినియోగం కీలకం.
కమిటీలు లేక.. నిధులకు బ్రేక్
‘ఆత్మ’కు నియోజకవర్గం వారీగా ‘బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ’ (రైతు సలహా సంఘం)ని ఎంపిక చేస్తారు. మొత్తం 30 మంది సభ్యుల్లో 25 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ రిజర్వేషన్ ఆధారంగా పురుషులతో పాటు మహిళా రైతులను ఎంపిక చేయడంతోపాటు మండల, జిల్లా పరిషత్ నుంచి ఐదుగురు ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ ఉంటారు. నియోజకవర్గాల నుంచి కలిపి డిస్ట్రిక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీని, ఇందులో నుంచి ఒక సభ్యుడిని రాష్ట్ర స్థాయికి సైతం ఎంపిక చేశారు. నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయశాఖ ఏడీఏ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నేతృత్వంలో కమిటీలను ఎన్నుకుంటారు. కాగా నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాల్లో కమిటీల ఎంపిక పెండింగ్‌లో ఉండటంతో జిల్లా కమిటీ ఇంకా ఎంపిక కాలేదు. దాంతో నిధులు నిలిచిపోయాయి. అయితే కామారెడ్డి జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు జిల్లా కమిటీ ఎంపిక పూర్తి కావడంతో రూ.19.39 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 13 జిల్లాల్లో కమిటీలు ఎంపికవ్వగా రూ.2.25 కోట్లు విడుదల అయినట్టు ప్రభుత్వాలు తెలిపాయి.
కమిటీల ఎంపికపై దృష్టిసారిస్తే మేలు
13 జిల్లాలకు సగటున రూ.20లక్షల మేర నిధులు విడుదల కాగా.. రైతు శిక్షణకు ఎంతో ఉప యుక్తమయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కమిటీల ఎంపిక రాజకీయంతో నిలిచిపోయినట్టు సమా చారం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియో జకవర్గంలో ఆరు మండలాలు నిజామాబాద్ జిల్లా పరిధిలో వస్తాయి. ఈ ఆరు మండలాలకు కలిపి కమిటీ ఎంపిక చేయాల్సి ఉండగా.. అక్కడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో కమిటీ ఎన్నిక నిలిచినట్టు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా భీంగల్ బ్లాక్(బాల్కొండ)లో సైతం కమిటీ ఎంపికపై అనిశ్చితి నెలకొంది. ఆత్మకు చైర్మెన్‌గా ఉన్న కలెక్టర్ స్పందించి కమిటీల ఎంపికపై దృష్టిసారించి వేగంగా పూర్తయ్యేలా చూస్తే తమకు మేలు జరిగే అవకాశం ఉందని రైతులు కోరుతున్నారు. ఇప్పటి వరకు కామారెడ్డితో పాటు ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, ములుగు, నల్లగొండ, సంగారెడ్డి, వరంగల్, హను మ కొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నియోజకవర్గంతో పాటు జిల్లా స్థాయిలో ఆత్మ కమిటీల ఎంపిక పూర్తయ్యింది.



