గీతికా తలుక్దార్… ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఆసక్తి. ఒకప్పుడు స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతో పోరాడింది. చిన్న అవకాశం దొరుకుతుందేమో అని ఆశగా గంటల తరబడి ఎదురుచూసింది. కానీ ‘ఇక్కడ మహిళలకు చోటు లేదు..’ అంటూ నిరాశపరిచేవారు. ఇలాంటి అవమానాలు ఎన్నో సార్లు ఎదుర్కొంది. అలాంటి ఆమె ఇప్పుడు ఒలింపిక్స్, ఫిఫా, క్రికెట్ ప్రపంచకప్.. వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా ఫొట్రోగాఫర్‌గా ఆమే కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు ‘ఫిఫా పురుషుల ప్రపంచకప్’ను కవర్ చేసిన ఆమె ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా పురుషుల ప్రపంచకప్-2026ను కూడా విజయవంతంగా కవర్ చేస్తుంది. అంతేకాదు ఈ అవకాశం అందుకున్న ఏకైక భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోగ్రఫీ ప్రయాణం గురించి నేటి మానవిలో…
అరుణాచల్ ప్రదేశ్‌లో పుట్టిపెరిగిన గీతికా.. అసోంలో స్థిరపడింది. చిన్నతనంలో తండ్రి ఉద్యోగ రీత్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో నివసించింది. దాంతో వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుంది. అసోంలోని దిబ్రూఘర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. గువహటిలోని ఓ విద్యా సంస్థలో ‘మాస్ కమ్యూనికేషన్-మీడియా టెక్నాలజీ’ విభాగంలో పీజీ డిప్లొమా చదివింది. BCIS Colombo నుంచి ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’ విభాగంలో మరో పీజీ డిప్లొమా చేసింది. తన తాతయ్య చంద్ర తలుక్దార్ స్ఫూర్తితో ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకుంది. ఆయన ప్రముఖ చిత్ర నిర్మాత. ఫొటోగ్రఫీపై ఇష్టంతో గీతికా దక్షిణ కొరియా ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో సియోల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి ‘గ్లోబల్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్’లో మాస్టర్స్ చదివింది. చదువు పూర్తయ్యాక ఓ ఫొటో న్యూస్ ఏజెన్సీలో ఇంటర్న్‌గా కెరీర్ ప్రారంభించింది. పలు మీడియా సంస్థల్లో ఫొటో జర్నలిస్ట్‌గా, కంట్రిబ్యూటర్‌గా పనిచేసింది.
సవాళ్లను అధిగమిస్తూ…
తనకు ఆసక్తి ఉన్న ఆటలకు ఫొటోగ్రఫీని జోడించి.. స్పోర్ట్స్ ఫొటో జర్నలిస్ట్‌గా ఎదగాలని గీతిక లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తను అనుకున్నది సాధించడం కోసం అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. ‘నాకు చిన్నప్పట్నుంచీ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. మా తాతయ్య ఆ కాలంలో దర్శక నిర్మాతగా పనిచేశారు. ఆయన్ని చూశాక ఈ రంగంపై ఆసక్తి మరింతగా పెరిగింది. అయితే క్రీడల్ని ఎంచుకోవడానికి ఓ కారణముంది. ఆటలంటేనే క్రమశిక్షణ, సమయపాలన. ఇవే నన్ను స్పోర్ట్స్ ఫొటో జర్నలిజం వైపు ఆకర్షించాయి. నిజానికి ఈ రంగంలో పురుషాధిపత్యం ఎక్కువ. అందుకే తెలిసిన వాళ్లందరూ మా అమ్మతో.. ‘అమ్మాయిని ఇలాంటి రంగంలోకి పంపిస్తావా? ఇందులో ఎన్ని సవాళ్లుంటాయో తెలుసా?’ అనేవారు. కానీ మా అమ్మ అవేవీ పట్టించుకోకుండా నా ఇష్టానికే ప్రాధాన్యమిచ్చింది. ఎవరేమనుకున్నా ఆయా క్రీడా పోటీలకు హాజరవడం, నా మొబైల్ కెమెరాలో వాటిని బంధించడం.. భలే సరదాగా అనిపించేది. తర్వాత టోర్నీల్లో క్రీడా ఫొటో జర్నలిస్ట్‌గా అవకాశాల కోసం ప్రయత్నించా. ‘క్రీడా ఫొటోగ్రఫీలో మగాళ్లకే కానీ ఆడవాళ్లకు ఇక్కడ చోటు లేదు..’ అంటూ కొంతమంది నన్ను నిరాశపరిచారు. ఇలా వెనుతిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి..’ అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది గీతిక. అయితే తర్వాత కాలంలో తన ప్రతిభతోనే ఒక్కో అవకాశాన్నీ అందుకుంటూ ప్రపంచంలోనే ది బెస్ట్ స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ల జాబితాలో చోటు సంపాదించుకుంది.
ఏకైక భారతీయ మహిళగా…
ఇరవై ఏండ్ల నుండి స్పోర్ట్స్ ఫొటో జర్నలిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న గీతిక.. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నెన్నో మెగా టోర్నీల్ని తన కెమెరాలో బంధించింది. జాతీయ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఐపీఎల్, ఇండియన్ సూపర్ లీగ్, సౌత్ ఏషియన్ గేమ్స్, టోక్యో ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్.. వంటి క్రీడా పోటీలతో పాటు పురుషుల క్రికెట్ ప్రపంచకప్, మహిళల క్రికెట్ ప్రపంచకప్.. వంటి అంతర్జాతీయ క్రీడల మెమరబుల్ మొమెంట్స్‌నీ ఫొటోల రూపంలో అందించి అభిమానులకు అందించింది. 2018, 2022ఫిఫా ప్రపంచకప్‌కి అధికారిక మహిళా ఫొటో జర్నలిస్ట్‌గా వ్యవహరించిన గీతిక.. ఇప్పుడు జరుగుతున్న ‘ఫిఫా పురుషుల ప్రపంచకప్-2026’ మెగా టోర్నీనీ తన కెమెరాలో బంధిస్తోంది. ఇలా మూడుసార్లు ఈ అవకాశం అందుకున్న ఏకైక భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్‌గా నిలిచింది.
సవాళ్లన్నీ దిగదుడుపే..
‘క్రీడా ఫొటో జర్నలిస్ట్‌గా ఈ వృత్తిలో ఎన్నో సవాళ్లుంటాయి. నిరంతరం దూర ప్రయాణాలు చేయడం, గంటల తరబడి స్టేడియంలోనే ఉండాల్సి రావడం.. కష్టంగానే అనిపిస్తుంది. కానీ క్రీడాకారుల మ్యాచ్ విన్నింగ్ మొమెంట్స్, అభిమానుల కేరింతలు, జట్టు భావోద్వేగాలు.. వంటి అపురూప క్షణాల్ని కెమెరా లో బంధించానన్న ఆనందం ముందు ఈ సవాళ్లన్నీ దిగదుడుపే..’ అంటున్నది గీతక. ఇలా మీడియా బాక్స్‌లో కూర్చొని మ్యాచ్ ఫొటోలు తీయడమే కాదు.. పలువురు క్రీడా ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా చేస్తుం ‘ఎంచుకున్న రంగమేదైనా.. సవాళ్లను తట్టుకొని నిలబడినప్పుడే మనమేంటో నిరూపించు కోగలం..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోన్న గీతిక విజయ ప్రస్థానం ఈతరం అమ్మాయిలందరికీ ఎంతో ఆదర్శం.



