జంట మంటలు

దేశ రాజకీయాలు ఒక్కసారిగా జమిలి ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మణిపూర్‌, హర్యానా ఘటనల నుండి దేశప్రజల దృష్టి మళ్లీంచడానికి కేంద్రం ఈ ఎత్తుగడను తీసుకోచ్చింది. అంతేకాదు ప్రతిపక్షాలను కనీసం సంప్రదించకుండానే మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. మార్గదర్శకాలను సైతం నిర్దేశించింది. జమిలి ఎన్నికలపై లా కమిషన్‌ లేవనెత్తిన కీలక ప్రశ్నలను అందులో ప్రస్తావించనే లేదు! కమిటీలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కూడా కల్పించలేదు. ప్రతిపక్షాల ఐక్య సంఘటన ”ఇండియా” మూడవ సమావేశం ముంబాయిలో జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అన్న పల్లవి అందుకుంది బీజేపీ సర్కార్‌. అనూహ్యంగా ఈనెల18 నుంచి 22 దాకా ఐదురోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ప్రత్యేక సమావేశాల ఎజెండా మాత్రం రహస్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ వల్ల సర్కారీ ఖజానాకు చాలా సొమ్ము కలిసివస్తుందని, తరచూ ఏదో ఒక మూల ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజాపాలన స్తంభించిపోతోందన్నది చెప్పే వారి మాటలు అర్థరహితం. ప్రవర్తన నియమావళి నియంత్రించేది అధికారపక్షాలకు అనుచిత లబ్ధి చేకూర్చే ఓట్ల తాయిలాలనే తప్ప, సాధారణ పాలనను కాదు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానం వాస్తవ రూపం దాల్చాలంటే కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలను ముందుగానే రద్దుచేయాలి. మరికొన్ని చోట్ల వాటి కాలపరిమితిని పొడిగించాలి. అందుకు రాజ్యాంగ సవరణ తప్పదు. రాజ్యాంగ అస్తిత్వానే కుళ్లబొడిచే సవరణలు చెల్లవని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే గిరిగీసింది. ఏకకాల ఎన్నికలు సుసాధ్యం కావాలంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల, పార్టీల ఏకాభిప్రాయాన్ని కూడగట్టక తప్పదని కేంద్రమే మొన్న జులైలోనే రాజ్యసభలో ప్రకటించింది. అంతలోనే మాట మార్చింది.
సమకాలీన రాజకీయ వాతావరణంలో ఏకాభిప్రాయ సాధన దుర్లభమే. అటువంటప్పుడు ఉన్న పళంగా జమిలిపై ఇంత హడావుడి ఎందుకు అన్నదే ఎవరికీ అంతుపట్టని ప్రశ్న. మన దేశంలో పార్టీలను చీల్చి ప్రభుత్వాలను పడగొట్టే దుష్ట సంస్కృతి వెర్రితలలు వేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులకు ఇది వెన్నతో పెట్టిన విద్య. ఒక్క స్థానం ఆధిక్యతతోనైనా సరే, ప్రభుత్వాలు సుస్థిరంగా మనగలిగే ప్రజాస్వామిక వాతావరణం మన దేశంలో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది. రాజకీయ అస్థిరతను నివారించాలంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సడలించాలి. ఒక వేళ జమిలి తలుపులే తెరుచుకుంటే రాష్ట్రపతి పాలన రూపేణా రాష్ట్రాలపై పెత్తనం చెలాయించేందుకు కేంద్రానికి అవకాశం చిక్కుతుందన్న భయాందోళనలూ వ్యక్తమవు తున్నాయి.
ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేశామని, త్వరలో మూడో పెద్ద వ్యవస్థగా ఎదుగుతుందని చెబుతోంది. కానీ, దేశంలో పేరుకుపోతున్న నిరుద్యోగం, అదుపులేని ద్రవ్యోల్బణం, తగ్గుతున్న ఉపాధి అవకాశాలు, పెరుగుతున్న ధనిక-పేద తారతమ్యాలు జీవన ప్రమాణాలను అతలాకుతలం కావిస్తున్నాయి. మణిపూర్‌ హింసాకాండ గురించి పార్లమెంటులో చర్చకు కూడా సాహసించలేకపోయినవారు ఇలాంటి జిమ్మిక్కులకు పూనుకుంటున్నారు.
మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల విధులు వేటికవే ప్రత్యేకమైనవి. ఈ మూడంచెల పాలన వ్యవస్థలో ఎవరి బాధ్యతలు ఏమిటో ఓటర్లకు తెలియాలి. వాటి ఆధారంగా వెలువడే ప్రజాతీర్పులే ప్రజాస్వామ్యానికి ఊపిరులూదుతాయి. గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్నింటికీ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ అంశాలే తప్ప స్థానిక సమస్యల ఊసే ఉండదు. అయినా ఒక రాష్ట్రంలోనే నాలుగైదు విడతల్లో పోలింగ్‌ నిర్వహించక తప్పని స్థితిలో ఎన్నికల కమిషన్‌ ఉంది. అందుకే ఏకకాల ఎన్నికలు ఆచరణలో అసాధ్యమైనవి. కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటుంది. అంతే కాకుండా దేశంలోని కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు కూడా పార్లమెంటు చేసిన సవరణను మూడిరట రెండొంతుల మెజారిటీతో అంగీకరించవలసి ఉంటుంది. రకరకాల సమస్యలు జనాన్ని పీడిస్తున్నాయి. ఫలితంగా పలుకుబడి క్షీణిస్తోందని సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. జమిలి ఎన్నికల మాట ఎలా ఉన్నా 2024 సార్వత్రిక ఎన్నికలను ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో నిర్వహించాలని మోడీ వ్యూహం అయి ఉండొచ్చు. ఎన్నికలకు సిద్ధంకావడానికి ”ఇండియా”కు తగినంత సమయం ఉండకూడదన్న దురుద్దేశమూ ఉంది. ఏమైనా జమిలి ఎన్నికలనేవి ఒక రాజకీయ ప్రయోజన వ్యూహం తప్ప మరోటి కాదు.

Spread the love