ఐక్యత, సహకారమే లక్ష్యంగా బ్రిక్స్‌ విస్తరణ

మొదట బ్రిక్స్‌ దేశాల కూటమిలో ఐదు దేశాలు ఉండేవి. అవి: బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఆ తర్వాత జొహన్నెస్‌బర్గ్‌ శిఖరాగ్ర సమావేశంలో మరో ఆరు దేశాలను కూడా చేర్చుకోవాలని నిర్ణయించారు. అవి: అర్జెంటీనా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌. మొత్తం 22 దేశాలు బ్రిక్స్‌లో చేరాలన్న ఉత్సుకతను వ్యక్తం చేయగా వాటిలోంచి పై ఆరింటిని ఎంపిక చేశారు. ప్రస్తుతం బ్రిక్స్‌కు అధ్యక్ష స్థానంలో ఉన్న దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ వర్గాలు వెల్లడి చేసిన వివరాల ప్రకారం ఏకంగా 40 దేశాలు బ్రిక్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉన్నట్టుండి బ్రిక్స్‌ వేదిక పలుకుబడి ఇంతగా పెరగడానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది.
”ఉన్నతస్థాయి”కి చెందిన సామ్రాజ్యవాద దేశాల సరసన నిలిచే అవకాశం నిరాకరించబడినందున కొన్ని పెద్ద దేశాలు తమ స్థాయికి గుర్తింపు వచ్చేలా తగిన పాత్రను ప్రపంచ వ్యవహారాలలో పోషించడానికి వీలుగా బ్రిక్స్‌ను ఏర్పాటు చేసుకున్నారని చాలామంది భావిస్తూంటారు. కాని బ్రిక్స్‌లో ఉన్న సభ్యదేశాలను చూస్తే వాటిమధ్య చాలా తేడాలున్నాయి. రష్యా, చైనా ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు. వాటికి అక్కడ వీటో హక్కు ఉంది. వాటిలో ఒకటైన రష్యా ప్రస్తుతం ”ఉన్నతస్థాయి” కూటమి దేశాలతో యుద్ధంలో ఉంది. ఇక రెండోది చైనా. ఆ దేశాన్ని తమ ప్రధాన శత్రువుగా ”ఉన్నతస్థాయి” దేశాలు ప్రకటించాయి. కాబట్టి ఆ రెండు దేశాలూ ”ఉన్నతస్థాయి” దేశాల సరసన చేరడానికి తహతహలాడుతున్నాయని అనుకోలేం. ఇక బ్రిక్స్‌ ఒక కూటమిగా ప్రపంచ రాజకీయాలలో తలెత్తిన ఏ ప్రధాన పరిణామంలోనూ గణనీయమైన పాత్రను పోషించినట్టు దాఖలా లేదు. బ్రిక్స్‌లో చేరితే తమ దేశానికి ప్రపంచ వ్యవహారాలలో ప్రాధాన్యత పెరుగుతుందని అనుకుని అందులో చేరడానికి సన్నద్ధతను వ్యక్తం చేస్తున్న దేశాలు ఏవీ లేవు. తమ ప్రాధాన్యతను పెంచుకోడానికే వివిధ దేశాలు బ్రిక్స్‌లో చేరడానికి సిద్ధపడుతున్నాయన్న వాదన ప్రస్తుత ప్రపంచంలోని రాజకీయ ఆర్థిక పరిస్థితులను పట్టించుకోలేదు.
ప్రస్తుత ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో మునిగివుంది. ప్రభుత్వాల ప్రతినిధులు, మితవాద ఆర్థికవేత్తలు ఎప్పుడూ ఉన్న వ్యవస్థను సమర్థించుకుంటూ వుంటారు. వారు సైతం ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక దీర్ఘకాలిక ఆర్థికమాంద్యంలో చిక్కుకునివుందని అంటున్నారు. పాత అంతర్జాతీయ సంస్థలు ఇటువంటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనడానికి సరిపోవు. ఆ సంస్థలనిప్పటి అవసరాలకు తగినట్టుగా మార్పు చేసే సత్తా సామ్రాజ్యవాద దేశాలకు లేదు. లేదా కొత్తదనాన్ని కలిగివుండి ప్రస్తుత పరిస్థితులకు తగినవిధంగా వ్యవహరించగల కొత్త సంస్థలను ఏర్పాటు చేయగల సత్తా కూడా వాటికి లేదు. ఈ పరిస్థితులలో బ్రిక్స్‌ ఒక ఆశాజనకమైన నవ్యత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం సామ్రాజ్యవాదుల గుప్పెట్లో ఉండే సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని నివారించగలవన్న విశ్వాసం క్రమంగా తరిగిపో తోందనడానికి తార్కాణమే బ్రిక్స్‌ పలుకుబడి పెరగడం. దీనిని బట్టి బ్రిక్స్‌ను ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక కూటమిగా చూడకూడదు. అందులో కొన్ని సభ్యదేశాలు నిస్సందేహంగా సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరినే కలిగివున్నాయి. కాని ఈజిప్ట్‌, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటివి ఏ కోశానా సామ్రాజ్యవాద వ్యతిరేకం కాదు. ఇప్పుడు బ్రిక్స్‌లో చేరగానే అవి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం అయిపోయాయని భావించలేం. సామ్రాజ్యవాదంతో విభేదించకుండానే ప్రస్తుత పరిస్థితుల్లో ఆశాజనకమైన వేరే దారి ఏదైనా ఉన్నదా అని అన్వేషిస్తున్న క్రమంలో వాటికి బ్రిక్స్‌ అటువంటి ఒక వేదికగా కనిపించింది. అందులో చేరడం ద్వారా రానున్న రోజుల్లో తమకు కావాల్సిన కీలకమైన సహాయం ఆశించవచ్చునని అవి ఆశిస్తున్నాయి.
ప్రస్తుతం విస్తరించిన బ్రిక్స్‌లో మూడు రకాల దేశాలు ఉన్నాయి. సామ్రాజ్యవాదం ఏకపక్షంగా ఆంక్షలు విధించడం, లేదా వాటికి నష్టం కలిగించేలా ”రక్షణ” విధానాలను అనుసరించడం కారణంగా కొన్ని దేశాలు, చమురు, సహజవాయువు ఉత్పత్తి చేసే దేశాలు, ఇప్పటికే ప్రపంచ సంక్షోభంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న దేశాలు, సమీపకాలంలో ఇబ్బందులను ఎదుర్కొనబోతున్న దేశాలు ఉన్నాయి చైనా, రష్యా, ఇరాన్‌ మొదటి కోవకి చెందినవి. రష్యా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యుఎఇ రెండో కోవకి చెందుతాయి. (ఒక దేశం రెండు, మూడు రకాల ఇబ్బందులను ఎదుర్కొనడం జరుగుతోంది) ఈజిప్ట్‌, ఇథియోపియా, అర్జెంటినా మూడో కోవకి చెందుతాయి. రాబోతున్న సంక్షోభంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు అవసరం అన్న దృష్టితో ఉన్నవి బ్రెజిల్‌, ఇండియా. ఎటువంటి భద్రతామండలి ఆమోదమూ లేకుండానే ఏకపక్షంగా సామ్రాజ్యవాదదేశాలు విధించిన ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశాలకు ఆ ఆంక్షలనుండి తప్పుకొని బయటపడడానికి మార్గాంతరంగా బ్రిక్స్‌ ఉండే అవకాశం కనిపి స్తోంది. ఈ అర్థంలో చూసినప్పుడు ఇరాన్‌ను సభ్యదేశంగా అంగీకరించాలన్నది జొహన్నెస్‌బర్గ్‌ శిఖరాగ్ర సమావేశం తీసుకున్న నిర్ణయాలలోకెల్లా ప్రాముఖ్యత కలిగివుంది. ఇరాన్‌ మీద తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధంచడమే కాదు, సంపన్న పశ్చిమ దేశాల్లో ఇరాన్‌ దాచుకున్న విదేశీ మారకపు నిల్వలను ఆ దేశం వినియోగించుకోడానికి వీలులేకుండా ఆంక్షకు గురైన మొదటి దేశం అది. సామ్రాజ్యవాద దేశాలు తమకు తాముగా ఏర్పాటు చేసుకున్న నిబంధనలకు సైతం ఇది విరుద్ధం. సామ్రాజ్యవాద ముఠానుండి ఇటువంటి ధాష్టీకం రానురాను మామూలైపోయింది. తాజాగా ఉక్రెయిన్‌ యుద్ధం నేపధ్యంలో రష్యా ఇదే విధమైన ఆంక్షను ఎదుర్కొంటోంది. విదేశాల్లోని తన స్వంత విదేశీమారకపు నిధులను రష్యా ఇప్పుడు వినియోగించుకోడానికి వీలు లేకుండా ఆంక్ష పెట్టారు. సామ్రాజ్యవాదులు పన్నిన ఈ ఉచ్చునుంచి బైట పడాలంటే బ్రిక్స్‌ అందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా తమ ఉత్పత్తుల ధరలు పడిపోవడం చమురు, సహజవాయువు ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. ఆ ధరలను పడిపోకుండా నిలబెట్టడానికి ఆ దేశాలు తమ ఉత్పత్తుల పరిమాణాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు వాటి డిమాండ్‌ పెరిగి ధరలు నిలబడతాయి. కాని ఇది అమెరికాకు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. బైడెన్‌తో సహా చాలామంది అమెరికా పనుపున సౌదీ అరేబియా పర్యటించి ఒపెక్‌ దేశాల సమావేశంలో ఉత్పత్తుల పరిమాణం తగ్గించుకోవాలన్న నిర్ణయం జరగకుండా ఉండాలని ఒత్తిడి తెచ్చారు. కాని అమెరికా ఒత్తిడులు ఫలించలేదు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఒపెక్‌ కూటమి తమ ఉత్పత్తుల పరిమాణాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను ప్రకటించింది. తమ సహజవనరుల ఉత్పత్తి విషయంలో ఆయా దేశాలు తగిన స్వేచ్ఛ కలిగివుండాలంటే కేవలం అమెరికా మీదే ఆధారపడి అంతర్జాతీయ సంబంధాలను నెరిపితే చాలదని, తమ సంబంధాలను విస్తృత పరచుకోవాలని, అదే సమయంలో అమెరికాకు ఆగ్రహం కలిగించకుండా వ్యవహరించాలని ఆ దేశాలు భావిస్తున్నాయి. అందుకు వాటికి బ్రిక్స్‌ ఒక దారిగా కనిపించింది.
ఇక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఈజిప్ట్‌, అర్జెంటినా, ఇథియోపియా వంటి దేశాలు, అంతమోతాదులో కాకపోయినా, ఇబ్బందులను ఎదుర్కొంటున్న బ్రెజిల్‌, ఇండియా, దక్షిణాఫ్రికా దేశాలు బ్రిక్స్‌ పట్ల ఆకర్షితులవడానికి కారణం వేరే ఉంది. డాలర్‌ ప్రమేయం లేకుండా అంతర్జాతీయ వ్యాపారం జరపగలిగే అవకాశం బ్రిక్స్‌ ద్వారా జరిగే వీలుంది. ఇటీవలే బ్రెజిల్‌, చైనా తమ స్థానిక కరెన్సీల రూపంలో పరస్పరం వ్యాపారం చేసుకోడానికి ఒప్పందం కుదుర్చు కున్నాయి. అదే మాదిరిగా ఇండియా, యుఎఇల మధ్య కుదిరింది. బ్రిక్స్‌ సభ్య దేశాల నడుమ ఈ తరహా ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలు రానున్న కాలంలో మరిన్ని జరుగుతాయి. బ్రిక్స్‌ పట్ల ఆకర్షితులవడానికి ఇదొక ప్రధాన కారణం.ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందం కుదుర్చుకునే దేశాల కరెన్సీల విలువలను సాపేక్షంగా నిర్ణయించుకుంటారు. అప్పుడు డాలర్‌ అనేది ఆ వ్యాపారంలో అవసరం ఉండదు. అప్పుడు ఆ రెండు దేశాలకూ పరస్పరం వ్యాపారం జరుపు కోడానికి ఎక్కువ కరెన్సీ అందుబాటులోకి వస్తుంది. (అదే డాలర్‌ అయితే దానిని పరిమితంగానే నిల్వ ఉంచుకోగలు గుతాయి) అప్పుడు వాటి వ్యాపారం కూడా విస్తరిస్తుంది. దానితోబాటు కరెన్సీ చెలామణీ కూడా పెరుగుతుంది. డాలర్‌ నిల్వల కొరత అనే సమస్య ఆ దేశాల వ్యాపారానికి అవరోధంగా ఇంకెంతమాత్రమూ ఉండదు.
అయితే ఇది సమస్యలో సగభాగానికి మాత్రమే పరిష్కారం. దానితోబాటు ఇంకొక అంశాన్ని కూడా పరిష్కరించుకోవాలి. రెండు దేశాల నడుమ వ్యాపారం జరిగినప్పుడు ఆ రెండింటిలో ఒక దేశం రెండో దేశానికి చేసిన ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండి దిగుమతుల విలువ తక్కువగా ఉంటే అప్పుడు చెల్లింపుల మిగులు ఒక దేశానికి, లోటు రెండో దేశానికి ఏర్పడుతుంది. ఆ తేడాను భర్తీ చేయడానికి మిగులు ఉన్న దేశం వెంటనే గాని, సమీప భవిష్యత్తులో గాని రెండో దేశంనుండి ఎక్కువ సరుకులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే విదేశీ వ్యాపా రంలో లోటును బర్తీ చేసుకోడానికి రుణం తీసుకోవలసిన అగత్యం తలెత్తదు. పైగా డాలర్‌ రుణం కోసం దేవులాడాల్సిన పనిలేనప్పుడు ఆ రెండు దేశాలూ తమ తమ ఉత్పత్తుల సామర్థ్యాన్ని మరింత పెంచుకోగులుగాయి. తద్వారా ప్రపంచ సంపద పెరుగుతుంది. అంటే డాలర్‌ నియంత్రణ నుండి బైటపడగలిగితే ద్వైపాక్షికంగా ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు లాభదాయకంగా ఆ ఒప్పందాలు పరిణమిస్తాయి.ఇటువంటి ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలను బ్రిక్స్‌ ప్రోత్సహిస్తే, వాణిజ్యలోటు ఏర్పడిన దేశాలు అప్పులపాలు గాకుండా ఆ దేశం నుండి రెండో దేశం వాణిజ్యలోటు భర్తీ అయే విధంగా సరుకులను దిగుమతి చేసుకుంటే, అప్పుడు అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకోలుకోడానికి ఎంతో దోహదం చేస్తుంది. అప్పుడు బ్రిక్స్‌ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి ఒక నిజమైన ప్రత్యామ్నాయ వేదికగా వ్యవహరించగలుగు తుంది.
బ్రిక్స్‌ సభ్యదేశాలలోని వామపక్ష వాదుల మధ్య ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. సామ్రాజ్యవాదం బ్రిక్స్‌ను గురించి ఏమను కుంటోంది? అన్నది వారి ప్రశ్న. కొంతమంది బ్రిక్స్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక వేదికే గాని, పెట్టుబడిదారీ వ్యతిరేక వేదిక కాదు అని వాదిస్తున్నారు. నిజానికి బ్రిక్స్‌ను సామ్రాజ్యవాద వ్యతిరేక వేదిక అని కూడా అనలేం. మోడీ, సౌదీ రాజు, ఈజిప్ట్‌కు చెందిన సిసి వంటి వారు ఆయా దేశాల అధినేతలుగా ఉండగా వారి ఆధ్వర్యంలోని బ్రిక్స్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక వేదిక ఎలా అవుతుంది? మరి బ్రిక్స్‌ వల్ల ఉపయోగం ఏమిటి? సామ్రాజ్యవాద పెత్తనం కింద ఉన్న ఐఎంఎఫ్‌ తదితర సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చెలాయిస్తున్న గుత్తాధిపత్యాన్ని ఎంతో కొంతమేరకు బ్రిక్స్‌ బలహీనపరచగలుగుతుంది. అది తప్పకుండా ఒక సానుకూల పరిణామమే. దానితోటే సామ్రాజ్యవాదానికి ఏదో పెద్ద దెబ్బ తగులుతుందని అనుకోలేం. అయితే ప్రపంచ శ్రామిక వర్గం సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోడానికి మరింత సానుకూల వాతావరణాన్ని బ్రిక్స్‌ సృష్టించగలదు.
(స్వేచ్ఛానురణ)
– ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love