ఎందుకింత నిర్లక్ష్యం?

Why neglect?

మణిపూర్‌లో మూడు నెలలుగా బిక్కుబిక్కుమంటున్న ప్రజల్ని చూసి దేశమే చలించిపోతోంది. కానీ మౌనముని మాత్రం నిద్ర నటించడం మానటం లేదు. డెబ్లై తొమ్మిది రోజుల తర్వాత మొసలి కన్నీరు కార్చినా ఇంతవరకు రాష్ట్రాన్ని సందర్శించి వారికి భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. అక్కడి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఎక్కడ చూసినా అరాచకాలు, ఆకలికేకలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా కన్నీటిగాథలే వినిపిస్తున్నాయి. కడుపునిండా తిండిలేక, కంటిమీద కునుకు లేక ప్రజలు శరణార్థులై సహాయశిబిరాల్లో తలదాచుకుంటున్న దుస్థితి నెలకొంది. ఏక్షణాన ఏం జరుగుతుందో తెలియక భయాందోళనల మధ్య బతుకులీడ్చాల్సిన పరిస్థితి వచ్చింది. మణిపూర్‌ను చూస్తుంటే మరో అప్ఘానిస్తాన్‌, మయన్మార్‌ గుర్తుకు రాకమానవు. బీజేపీ డబులింజన్‌ సర్కార్‌ పాలనలో సొంత దేశంలోనే పరాయి వాళ్లలా తలదాచుకుంటున్న ఘోరస్థితి దాపురించింది. అయినా ‘విశ్వగురువు’ మాత్రం అక్కడికి వెళ్లడం లేదు. ఎందుకింత నిర్లక్ష్యం?
పచ్చని కొండల్లో నెత్తురు చిమ్ముతోందనే విషయం తెలిసినా ప్రధాని నిర్దిష్ట కార్యచరణకు పూనుకోవడం లేదు. మే4న జరిగిన ఇద్దరు కూకీల నగ ఊరేగింపు వీడియో వైరల్‌ అయి దేశమంతా దిగ్భ్రాంతికి గురైతేగానీ ఆ మాత్రమైనా స్పందించలేదు. పార్లమెంట్‌లో ప్రతిపక్షనేతలు చర్చకు పెట్టినా పట్టింపులేదు. ఆయనతో ఎలాగైనా మాట్లాడించాలని చివరకు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. అయినా వారికి సమాధానం చెప్పే తీరిక ఆయనకు లేదు. ఎందుకంటే హింసను చల్చార్చే ఆలోచన ఉంటే కదా! ఆ హింసకు ఆజ్యంపోసి అక్కడి నుంచి కుకీలను తరిమే కుట్రకోణం దాగుంది గనుకే అక్కడ ఏం జరిగినా దేశ్‌కీ నేేతకు కండ్లు కనిపించడం లేదా? మాటలు వినిపించడం లేదా? ఇప్పటికే మైతేయిల ఆధిపత్యంలో నలుగుతున్న వారిపై తాజా పరిస్థితులను అడ్డం పెట్టుకుని మరిన్ని హింసాత్మక ఘటనలకు పూనుకుంటున్నారు. ఇవన్నీ తెలిసినా రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ ఉత్సవ విగ్రహంలా ఉంటున్నాడే తప్ప చర్యలకు సిద్ధపడటం లేదు. ఎందుకంటే అక్కడ జరిగే ఘటనలన్నింటికీ కర్త, కర్మ, క్రియ వారే కాబట్టి!
జరుగుతున్న హింసల్లో ఇండ్లన్నీ ధ్వంసమవ్వగా సహాయశిబిరాల్లోనే చాలామంది తలదాచుకుంటున్నారు. కుకీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చురాచంద్‌పూర్‌లోని ఓ సహాయ శిబిరంలో ఏడునెలల గర్భిణి తెతియమ్‌ చిందర వందరగా పడి ఉన్న పాతబట్టల మధ్య ఓ హాలులో కూర్చుని భయం భయంగా గడుపుతోంది. అమె ఇల్లు హింసాత్మక ఘటనలో ధ్వంసమైంది. తనకేమైనా పర్వాలేదు కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించే ఆమె ఆందోళనంతా. సరిగా ఆహారం దొరకడం లేదని, గర్భిణి గనుక పౌష్టికాహారం అవసరమని, మందులు కూడా అందుబాటులో లేవని ఆ నిండుచూలాలు చెబుతుంటే ఆవేదన కలుగుతోంది. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఎందరో అభాగ్యులు ఆదుకునేవారి కోసం నేడు ఆర్తనాదాలు చేస్తుంటే దేశం కంటతడి పెడుతోంది. కానీ మన మాన్‌కీబాత్‌ నేత మాత్రం మౌనం వీడటం లేదు. మరోవైపు కుకీలను ఇదే అదనుగా మరింత అణగదొక్కేలా ప్రయత్నాలు సాగడం బాధాకరం. ప్రాణభయంతో శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి ఆహారం, నిత్యవసరాలు, గ్యాస్‌ సరఫరా కాకుండా అడ్టుకుంటున్నారు. ఇంఫాల్‌ నుంచి కొండ ప్రాంతాలకు వచ్చే సరుకుల్ని అడ్డగించి వాటిని దోచుకుంటున్నారు. ఆపై వాహనాలనూ తగలబెడుతున్నారు. ఇవి సాక్షాత్తూ అక్కడి భద్రతా సిబ్బంది వెల్లడించిన నిజాలు.
ప్రభుత్వమే మైతేయిలకు అండగా ఉందనేది స్పష్టం. మైదాన ప్రాంతాల్లో జనజీవనం మామూలుగానే ఉంది. కానీ కొండిపాంతాల్లో పాలన గాలికొదిలేసింది. తెగల మధ్య ఘర్షణతో అక్కడ వివక్ష కూడా తారా స్థాయికి చేరింది. ఆదివాసీల పట్ల కనీస మానవత్వం ప్రదర్శించడం లేదు. మైతేయిల్లో ఎమ్మెల్యేలు, అధికారుల ప్రాబల్యం ఎక్కువ గనుక ఆధిపత్య ధోరణి చూపిస్తున్నారు. వారికి చాలినంత రేషన్‌ ఇవ్వడం లేదు. చిన్న పిల్లలకు అవసరమైన ఆహారం అందించడం లేదు. మందులు, శానిటరీ వస్తువులు అందుబాటులో ఉంచడం లేదు. పైగా వారు నివసించే ప్రాంతాల్లో నిత్యావసరాల ధరలు పెంచేశారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,500, పెట్రోల్‌ చిన్నబాటిల్‌ రూ.150. ఇవి కొందామన్నా నల్లబజారులోనే. ఇక దినసరి కూలీల బతుకులు మరింత మృగ్యం. అడుక్కుంటే తప్ప ఆకలి తీరడం లేదు. ఇవన్నీ మన యాభై ఆరు ఇంచుల చాతి గల నేతకు తెలియదనుకుంటే పొరపాటే అవుతుంది. అమిత్‌షా సందర్శించి వచ్చాకే మణిపూర్‌ మరింత తగలబడటం గమనార్హం.

Spread the love