నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మండలం మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి, దొంగిలించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చుక్కాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు ఇందూరి ఎల్లగౌడ్ తన స్కూటీ దొంగిలించబడిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తులసి ఆయిల్ మిల్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను గజ్వేల్ మండలం ధర్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మరదన్నపేట మహేష్ గౌడ్ (34)గా గుర్తించారు.
మహేష్ గౌడ్ గత కొంతకాలంగా మద్యం అలవాటుకు బానిసై డబ్బుల కోసం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో బైక్ మెకానిక్‌గా పనిచేసిన అనుభవంతో వాహనాలను సులభంగా దొంగిలిస్తున్నట్లు వెల్లడించారు. అతని వద్ద నుంచి చుక్కాపూర్‌కు చెందిన హోండా యాక్టివా (TG 17 A 1786)తో పాటు మూడు రోజుల క్రితం సిరిసిల్లలో దొంగిలించబడిన స్ప్లెండర్ ప్లస్ (AP15Q3348) బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు.



