నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. వందల డ్రోన్లలను ఏకధాటిగా రష్యాపైకి ప్రయోగిస్తోంది. తాజాగా ఈ అనుహ్య దాడులపై రష్యా విదేశాంగ మంత్రి మరియా జఖరోవా కీలక హెచ్చరిక చేశారు. ఉక్రెయిన్ దేశానికి అమెరికా అండగా ఉండి, ఆయుధాలు సరఫరా చేస్తోందని ఆరోపించారు. అమెరికా పదే పదే ఆయుధా సరఫరాతో ప్రపంచ స్థిరత్వానికి “ఊహించని పరిణామాలకు” దారితీయవచ్చని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా హెచ్చరించారు, ఉక్రెయిన్‌కు ఆయుధాల బదిలీపై మాస్కో తన ఆందోళనలను వాషింగ్టన్‌కు పదేపదే తెలియజేసిందన్నారు.
“వాషింగ్టన్‌తో తమ చర్చల సందర్భంగా కీవ్ ప్రభుత్వానికి సైనిక పరికరాలను సరఫరా చేయడం ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వానికి ఊహించని పరిణామాలకు దారితీయవచ్చని తాము పదేపదే నొక్కిచెప్పాము” అని జఖరోవా తెలియజేశారు.
ఉక్రెయిన్‌కు పాశ్చాత్య ఆయుధాలను రవాణా చేసే కాన్వాయ్‌లను రష్యా సైన్యం “చట్టబద్ధమైన లక్ష్యాలుగా” పరిగణిస్తుందనే రష్యా వైఖరిని ఆమె పునరుద్ఘాటించారు. జూన్ 19న జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలను కూడా జఖరోవా విమర్శించారు. ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో బెలారస్‌లో ఉన్న రీట్రాన్స్‌మిషన్ స్టేషన్లను వారం రోజుల్లోగా తొలగించకపోతే, వాటిపై దాడులకు ఆదేశించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ ప్రకటనలు అతని ఉగ్రవాద స్వభావాన్ని పూర్తిగా ఎత్తి చూపుతున్నాయి.” “ఉగ్రవాదులు చెప్పేది అదే,” అని జఖరోవా విమర్శించారు.



