హైదరాబాద్: అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమి, తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) జట్ల నడుమ జరుగనున్న అండర్-17 క్రికెట్ కప్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. నాలుగు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నమెంట్ ఈ నెల 24న ఎల్బీ స్టేడియం వేదికగా ఆరంభం కానుంది. టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా రానున్నారని టీడీసీఏ అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమి ప్రెసిడెంట్ అరుణ్ కొలిపాక, అమెరికా యూనివర్శిటీ ప్రొఫెసర్ టి. సత్యనారాయణ రెడ్డి సహా టీడీసీఏ జిల్లా క్రికెట్ సంఘాల కన్వీనర్లు తదితరులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.