– తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ గిరిజనులకు తీవ్ర నిరాశ మిగిల్చిందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మనాయక్, ఆర్. శ్రీరాం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేండ్లలో గిరిజనుల అభివృద్ధికి నూతన పథకాలను ప్రవేశ పెట్టక పోగా ఉన్న పథకాలకు సైతం అరకొరా నిధులు కేటాయించారని విమర్శించారు. 2022-23 బడ్జెట్లో రూ.8,451 కోట్లు కేటాయించి, రూ.7,273 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన రూ.1,178 కోట్లను కేంద్రం దారిమళ్లించిందని తెలిపారు. అలాగే గతేడాది బడ్జెట్లో రూ.12,461 కోట్లు కేటాయించి సవరించిన అంచనాలో రూ. 7,605 కోట్లకు తగ్గించి గిరిజనులను దగా చేసిందని విమర్శించారు. తాజా బడ్జెట్లో కేవలం రూ.13 వేల కోట్లు కేటాయించిన మోడీ సర్కార్… దేశంలో ఉన్న 15 కోట్ల మంది గిరిజనులను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం గిరిజనులకు కేటాయించాల్సిన నిధులను సైతం తగ్గించడం అన్యాయమని అన్నారు. గతంలో ప్రధానమంత్రి పీవీటిజీల అభివృద్ధి మిషన్ పేరుతో కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన రూ.15 వేల కోట్లు, షెడ్యూల్ ట్రై అభివద్ధి యాక్షన్ ప్లాన్ పేరిట రూ. లక్ష 17 వేల కోట్లు గత రెండు సంవత్సరాలుగా ఖర్చు చేయకపోవడం గిరిజనుల పట్ల కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని విమర్శించారు. గిరిజనుల్లో ఆకలి, దారిద్య్రం గతం కంటే గణనీయంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. వారి అభివృద్ధికి ఆటంకంగా మారిన బిజెపి ప్రభుత్వాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడం ద్వారానే న్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు.