– సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత
– హైదరాబాద్‌లో పవర్ గ్రిడ్ వర్కర్స్ యూనియన్ మహాసభ
నవతెంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని పాలకులు అవలంబిస్తున్న విధానాలు మారకుండా కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావనీ, విధానాల్లో మార్పు కోసం పవర్ గ్రిడ్ కార్మికులు ఐక్య ఉద్యమాలను నిర్మించాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పవర్ గ్రిడ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) అధ్యక్షులు ఇ.తాతారావు అధ్యక్షతన సదరన్ రీజనల్ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు శక్తులకు కారు చౌకగా కట్టబెడుతున్నదని విమర్శించారు. కోడ్‌లపేరుతో కార్మికుల హక్కులను హరిస్తున్న తీరును వివరించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో పవర్ గ్రిడ్‌ను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడకుండా కార్మికుల మధ్య విభజనను తీసుకొచ్చి ఉద్యమాలను చీల్చే ప్రయత్నం చేస్తున్న తీరును ఎండగట్టారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు స్వదేశీ దేవరారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం కాంట్రాక్ట్, పర్మినెంట్ కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలనీ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా పర్మినెంట్ కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు మాట్లాడుతూ.. హక్కుల కోసం ఐక్య పోరాటాలే శరణ్యమన్నారు. మహాసభలో ఆ యూనియన్ జాతీయ నాయకులు రాఘవేంద్ర, సిద్దప్ప, పవర్ గ్రీడ్ వర్కర్స్ యూనియన్ ఎస్.ఆర్ -1 కార్యదర్శి షేక్ బాజీ, నాయకులు బి శ్రీను నాయక్, సిహెచ్ సురేష్, పి నారాయణస్వామి, ఎండి అబ్దుల్లా, బి శివ, కే అశోక్, శివకుమార్, ఎం రమణ తదితరులు పాల్గొన్నారు.