– ఈ ఏడాది పార్లమెంటులో ప్రవేశపెట్టినవి 18 మాత్రమే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పద్దులపై ఈ ఏడాది కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలలో కేవలం 18 నివేదికలను మాత్రమే పార్లమెంట్ ముందు ఉంచారు. వాస్తవానికి పార్లమెంటులో ప్రవే శపెడుతున్న కాగ్ నివేదికల సంఖ్య రానురానూ తగ్గిపోతోంది. 2019-2023 మధ్యకాలంలో సగటున ఏడాదికి 22 నివేదికలు మాత్రమే సభ ముందుకు వచ్చాయి. 2014-2018 మధ్యకాలంలో సగటున 40 నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది పార్లమెంట్ ముందు ఉంచిన కాగ్ నివేదికల సంఖ్య మరింతగా తగ్గిపోయింది. 2010-2023 మధ్య కాగ్ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన 400కు పైగా ఆడిట్ నివేదికలను విశ్లేషించగా ఈ విషయాలు వెలుగు చూశాయి. కేంద్ర ప్రభుత్వానికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కాగ్ సమర్పించిన నివేదికలను ఇప్పటి వరకూ పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన నివేదికల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉదాహరణకు గత ఐదు సంవత్సరాల కాలంలో రైల్వే శాఖకు చెందిన 14 ఆడిట్ నివేదికలను మాత్రమే సభలో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఐదు సంవత్సరాల కాలంలో 27 నివేదికలు సభ ముందుకు వచ్చాయి.
ప్రస్తుతం కాగ్‌గా వ్యవహరిస్తున్న జీసీ ముర్ము గతంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. ఆయుష్మాన్ భారత్, ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్‌కు సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికలకు ఇన్‌ఛార్జిలుగా పనిచేసిన ముగ్గురు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారులను ముర్ము బదిలీ చేశారు. ఈ రెండు నివేదికలలోని అంశాలపై ప్రతిపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ ఆడిట్ నివేదికల తర్వాత క్షేత్రస్థాయి పనులన్నింటినీ నిలిపివేయాలంటూ న్యూఢిల్లీలోని కాగ్ కార్యాలయం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కాగ్ తోసిపుచ్చింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రవేశపెట్టిన 12 కాగ్ నివేదికలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాయి. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలలో చోటుచేసుకున్న ఆర్థిక, ఇతర అవకతవకలపై ఆ నివేదికలు అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. తనకు ఇబ్బందికరంగా ఉన్న నివేదికలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కోల్డ్‌స్టోరేజీలో ఉంచుతోందన్న విమర్శలు వస్తున్నాయి.