ఫ్రాన్స్‌లో ఆగని హింసాత్మక ఘటనలు |

నవతెలంగాణ – పారిస్‌ : ఫ్రాన్స్‌లో పోలీసు కాల్పుల్లో సహేల్‌ (17) అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ ఘటన అనంతరం పోలీసు చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ హింసాత్మక ఘటనలను అదుపు చేసేందుకు శుక్రవారం దాదాపు 45వేల మంది పోలీసులు మోహరించారు. ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసాకాండను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన హింసకు ప్రేరేపిస్తున్న టీనేజీ యువకులను ఇంట్లోనే ఉంచాలని తల్లిదండ్రులను కోరారు. శుక్రవారం మాక్రాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సహేల్‌ మరణానంతరం దేశంలో అశాంతిని వ్యాపింపజేయడంలో సోషల్‌మీడియానే ప్రధాన పాత్ర పోషించిందని, ముఖ్యంగా సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్‌చాట్‌, టిక్‌టాక్‌ వంటి వాటిల్లో హింసాత్మక ఘటనకు ప్రేరణ కలిగిస్తున్న సున్నిత అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని ఆయన అన్నారు. కాగా, సహేల్‌ కుటుంబం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. సహేల్‌ తల్లి మౌనియా గురువారం ఫ్రాన్స్‌ 5 అనే టెలివిజన్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘నేను పోలీసులను నిందించను. ఒక వ్యక్తిని మాత్రమే నేను నిందిస్తాను. అతనే నా కొడుకు ప్రాణాలను తీశాడు. 38 ఏళ్ల అధికారి అరబ్‌కు చెందిన చిన్నపిల్లాడిని చూసి ప్రాణాలు తీయాలనుకున్నాడు. ఆ అధికారే నా కొడుకు ప్రాణాలను కూడా తీశాడు’ అని ఆమె ఆరోపించారు. వలసవాదులపై ఫ్రాన్స్‌ పోలీసులు జాతి దురంహకార వైఖరిని ప్రదర్శిస్తుంటారు. తాజాగా పోలీసులు ఆఫ్రికాకు చెందిన సహేల్‌నే కాదు… ఈ ఏడాదిలో మరో ఇద్దరు వలసవాదులను కూడా కాల్చి చంపారు.

Spread the love