బీజేపీలో అసంతృప్త రాగాలు

Unsatisfied tunes in BJP– రాజగోపాల్‌రెడ్డి అటా? ఇటా?
– పాలమూరులో డీకే వర్సెన్‌ జితేందర్‌రెడ్డి
– పద్మకు టికెట్‌ కేటాయింపుతో అలిగిన రాకేశ్‌రెడ్డి
– అధిష్టానాన్ని నిలదీస్తున్న టికెట్లు దక్కని నేతలు
– సర్దిచెప్పలేక తల పట్టుకుంటున్న రాష్ట్ర నాయకత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీలో అసంతృప్త రాగాలు తీవ్రమయ్యాయి. ఇన్నేండ్ల నుంచి పార్టీని పట్టుకుని పనిచేస్తున్న తమను కాదని కొత్తవారికి టికెట్లు కేటాయించడంపై నేతలు గుస్సా అవుతున్నారు. రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని ‘తమ పరిస్థితి ఏంటి?’ అని పార్టీని నిలదీస్తున్నారు. వారికి సర్దిచెప్పలేక రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటున్నది. ముఖ్యులందరూ బరిలో ఉండాల్సిందేనని జాతీయ నాయత్వం ఆదేశించినా చాలా మంది మాజీ ఎంపీలు, ముఖ్యనేతలు పోటీకి నిరాకరించడంతో బలహీన అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి ఆ పార్టీకి దాపురించింది. తాను మునుగోడు నుంచి పోటీ చేయాలా? ఎల్‌బీనగర్‌ నుంచి బరిలోకి దిగాలా? అని తేల్చకుండా రాజగోపాల్‌రెడ్డి అధిష్టానానికే పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌ ప్రకటన తర్వాత పార్టీలో అసంతృప్తి జ్వాల మొదలైంది. టికెట్లు దక్కని ఆశావాహులు రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఇదే విషయంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డిని వచ్చి కలిసినట్టు తెలుస్తోంది. దీంతో వారికి సర్దిచెప్పలేక ఆయనతోపాటు ముఖ్యనేతలు తిప్పలు పడినట్టు సమాచారం. కొందరు నేతలు ఒకడుగు ముందుకేసి ‘ఇన్ని రోజులు కష్టపడ్డది వేరేవాళ్లకు త్యాగం చేయడానికా? తమను కాదని కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తారా? ఇదేం పద్ధతి? పార్టీ నిర్మాణ పద్ధతి ఇదేనా? మేం కచ్చితంగా రెబల్‌గా ఉంటాం’ అని ఖరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఏనుగుల రాకేశ్‌ రెడ్డి తనకే టికెట్‌ వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. నియోజకవర్గానికి పరిమితమై క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. తీరా ఇప్పుడు ఆ స్థానాన్ని రావు పద్మకు కేటాయించారు. పార్టీ నాయకత్వంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మానకొండూరులో పార్టీ సీనియర్‌ నేత శంకర్‌కు కాకుండా ఇటీవల కొత్తగా చేరిన ఆరెపల్లి మోహన్‌కు పార్టీ టికెట్‌ కేటాయించింది. రామగుండంలో ఇటీవల చేరిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణికి టికెట్‌ ఇచ్చింది. గోషామహల్‌ టికెట్‌ కేటాయిస్తామనే బలమైన హామీతోనే విక్రమ్‌గౌడ్‌ హస్తం పార్టీని వీడి కమలం గూటికి చేరారు. రాజాసింగ్‌పై వేటు, తదనంతర పరిణామాలతో క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారు. తీరా తొలిజాబితాలో ఆయన స్థానంలో రాజాసింగ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణకు బీజేపీ మొండిచేయి చూపించింది. ఆ స్థానం నుంచి ఎంపీ అర్వింద్‌ సూచించిన ధన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్తాకు సీటిచ్చింది. అర్వింద్‌పై లక్ష్మినారాయణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి.
‘పాలమూరు’పై ఇరువురి పట్టు
మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వం ప్రకటన బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది. ఈ విషయంలో కరవమంటే కప్పకు కోపం..విడమంటే పాము కోపం అన్న చందంగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. తనకు కచ్చితంగా ఆ సీటు కేటాయించాలని డీకే అరుణ పట్టుబడుతున్నది. జాతీయ నాయకత్వం మాత్రం ఆ సీటును మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. దీనికి ఆయన సముఖంగా లేరు. తన కొడుక్కి ఆ సీటు ఇస్తే కచ్చితంగా గెలిపించుకుని వస్తానని అధిష్టానం వద్ద సవాల్‌ చేసి మరీ పట్టుబడుతున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేక ఎన్నికల కమిటీ ఆ నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టేసింది.
హౌల్డ్‌లో మునుగోడు
బీజేపీ తొలి జాబితాలో స్కీనింగ్‌ కమిటీ చైర్మెన్‌ రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో సింపతితో ఆయన కచ్చితంగా గెలుస్తాడని బీజేపీ నాయకత్వం ప్రచారం చేస్తున్నది. కానీ, ఆయన మాత్రం అక్కడ నుంచి పోటీచేసేందుకు వెనకాముందు ఆలోచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నిసార్లు సర్వే చేయించుకున్నా కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బరిలో ఉంటే తాను గెలవడం సాధ్యం కాదని తేలటంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. ఒకవేళ కాంగ్రెస్‌ గనుక ఆ సీటును సీపీఐకి కేటాయిస్తే కాంగ్రెస్‌ ఓట్లు తనకు క్రాస్‌ అయితే గెలువొచ్చనే ఆలోచనతో ప్రస్తుతానికి తన అభ్యర్థిత్వాన్ని హౌల్డ్‌లో పెట్టాలని రాజగోపాల్‌రెడ్డి జాతీయ నాయకత్వాన్ని కోరినట్టు సమాచారం. మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో ఉంటే తనకు ఎల్‌బీనగర్‌ సీటు కేటాయించాలనీ, లేనిపక్షంలో తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోనని ఆయన స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఎల్‌బీ నగర్‌కు రావడంపై రంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు అస్సలు అంగీకరించడం లేదు.

Spread the love