– సామాజిక న్యాయం, సమానత్వం, ఐకమత్యంతోనే సమాజ అభివృద్ధి
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
సామాజిక న్యాయం, సమానత్వం, ఐకమత్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో కాపు సామాజిక వర్గాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంగవీటి మోహనరంగా ప్రజల కోసం నిలబడిన నాయకుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, సామాన్య ప్రజల సమస్యలపై ఆయన పోరాటం చేశారని, ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
సమాజంలోని ప్రతి కులానికి, ప్రతి వర్గానికి సముచిత గౌరవం, సమాన అవకాశాలు లభించడమే నిజమైన సామాజిక న్యాయమని పేర్కొన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు వేరైనా అందరూ ఒకే సమాజంలో సోదరులుగా జీవిస్తున్నారని, పరస్పర గౌరవంతో ముందుకు సాగినప్పుడే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఎవరినీ తక్కువగా చూడకుండా అన్ని సామాజిక వర్గాలను సమానంగా గౌరవించాలని పిలుపునిచ్చారు.
బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది:
బీసీలకు రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల సాధనతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. బీసీ యువతకు విద్య, ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
కులాల మధ్య చిచ్చు పెట్టే విధానాలకు దూరంగా ఉండి అన్ని వర్గాల మధ్య సోదరభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఒకరి విజయాన్ని మరొకరు అభినందిస్తూ, కష్టాల్లో పరస్పరం అండగా నిలవాలని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం భిన్న సామాజిక వర్గాలు, సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన ప్రాంతమని, ప్రజల మధ్య ఉన్న ఐక్యత, ఆత్మీయత నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాయని పేర్కొన్నారు.
వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని అశ్వారావుపేటలో ఏర్పాటు చేయడం ద్వారా ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసే అవకాశం ఏర్పడిందన్నారు. రంగా ఆశయాలను స్మరించుకోవడంతో పాటు పేదలు, సామాన్యులు, బలహీన వర్గాల కోసం పనిచేసే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు.
కార్యక్రమానికి వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, యడవల్లి కృష్ణ, కరాటం రాంబాబు తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాపు సామాజిక వర్గాల నాయకులు, యువత, రంగా అభిమానులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


