Sunday, June 28, 2026
E-PAPER
Homeఖమ్మంపాత విధానంలోనే యూరియా సరఫరా చేయాలి

పాత విధానంలోనే యూరియా సరఫరా చేయాలి

- Advertisement -

– ఏఐయూకేఎస్ మండల కమిటీ డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట

రైతులకు సాగు కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందించాలని, ముఖ్యంగా యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, గతంలో మాదిరిగా నేరుగా ఎరువులను పంపిణీ చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) అశ్వారావుపేట మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్త కావడిగుండ్ల గ్రామంలో ఆదివారం కంగాల కన్నయ్య అధ్యక్షతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, జిల్లా గౌరవాధ్యక్షుడు కంగాల కల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.

యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యాప్ విధానం సాంకేతిక సమస్యలతో కూడుకున్నదని, దీనివల్ల వృద్ధ రైతులు, సాంకేతిక పరిజ్ఞానం లేని చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. యాప్ నిబంధనలను పూర్తిగా తొలగించి, రైతులకు సులభంగా ఎరువులు అందే విధంగా పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.

అకాల వర్షాలు, సాగు పెట్టుబడులు పెరగడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొంటూ, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పోడు సాగుదారుల సర్వేలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసేందుకు వెంటనే రీ-సర్వే నిర్వహించి, అర్హులైన సాగుదారులందరికీ ప్రభుత్వమే స్వయంగా భూ పట్టాలు పంపిణీ చేయాలని కోరారు.

అశ్వారావుపేట మండలంలో రైతులు పండిస్తున్న వివిధ పంటలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలు కావడం లేదని, దీంతో రైతులు మధ్యవర్తుల దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో ఏఐయూకేఎస్ మండల కార్యదర్శి గొంది లక్ష్మణ్‌రావు, నాయకులు కోడె భీముడు, కణితి పెద్ద జోగరావు, కొమరం భీమరాజు, జెడ్డి బుచ్చయ్య, కోవ్వాసి పొట్టి, సోడెం ముత్యాలు, తెల్లం సత్యం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, కొత్త కావడిగుండ్ల సర్పంచ్ బాడిస లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -