90 రోజులకు మించి వలసదారులను విచారణ లేకుండా నిర్బంధించొద్దని ఆదేశం
టెక్సాస్, లూసియానాలో వేలాది మంది
ఇమ్మిగ్రెంట్స్‌కు ఉపశమనం
వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానానికి ఎదురుదెబ్బ తగిలింది. దేశ బహిష్కరణ (డిపోర్టేషన్) ప్రక్రియ కొనసాగుతోందనే కారణంతో వలసదారులను 90 రోజులకు మించి నిర్బంధించాలంటే వారికి తప్పనిసరిగా బెయిల్ కోరేందుకు విచారణ (బాండ్ హియరింగ్) అవకాశం కల్పించాలని అమెరికా ఐదో సర్క్యూట్ అప్పీల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కీలక తీర్పు టెక్సాస్, లూసియానా రాష్ట్రాల్లో నిర్బంధంలో ఉన్న వేలాది మంది వలసదారులకు ఉపశమనం కలిగించే అవకాశముంది.
అమెరికాలో అక్రమ వలసలను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో దేశంలో ఇప్పటికే నివసిస్తున్న కొంతమంది విదేశీయులను కూడా ‘అడ్మిషన్ కోరుతున్న దరఖాస్తుదారులు’గా పరిగణించి, వారి డిపోర్టేషన్ కేసులు పూర్తయ్యే వరకు బెయిల్ అవకాశం లేకుండా తప్పనిసరి నిర్బంధంలో ఉంచే విధానాన్ని అక్కడి యంత్రాంగం అమలు చేస్తోంది. అయితే ఈ విధానాన్ని సవాలు చేస్తూ ఇద్దరు మెక్సికో పౌరులు, ఒక హోండురాస్ పౌరుడు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యూ ఆర్లియన్స్ కేంద్రంగా పనిచేసే ఐదో సర్క్యూట్ అప్పీల్ కోర్టు 2-1 మెజారిటీతో కీలక తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు ప్రకారం.. వలసదారులను 90 రోజులకు మించి నిర్బంధించాలంటే వారికి ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఎదుట హాజరై బెయిల్‌పై విడుదల కోరే అవకాశం ఇవ్వాల్సిందే. ఎలాంటి విచారణా లేకుండా నిరవధికంగా నిర్బంధించడం అమెరికా రాజ్యాంగంలోని ఐదో సవరణ కల్పించిన న్యాయ ప్రక్రియ హక్కులకు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. అయితే ట్రంప్ నియమించిన న్యాయమూర్తి కోరీ విల్సన్ ఈ తీర్పుతో విభేదించారు. వలస అంశాలపై నిర్ణయాధికారం ప్రధానంగా అమెరికా కాంగ్రెస్‌కే ఉందని, కోర్టు ఆ అధికార పరిధిని తగ్గిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
వలసదారుల తరఫున వాదించిన అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ న్యాయవాది రెబెక్కా క్యాస్లర్ ఈ తీర్పును స్వాగతించారు. ప్రభుత్వం ఎవరినీ నిరవధికంగా నిర్బంధించే అధికారం లేదని కోర్టు స్పష్టంగా చెప్పిందని ఆమె వివరించారు. మరోవైపు అమెరికా అంతర్గత భద్రతా శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ) మాత్రం ఈ తీర్పుతో విభేదించింది. తప్పనిసరి నిర్బంధంపై తమ న్యాయపరమైన వాదన బలంగా ఉందని, ఈ అంశంపై తుది నిర్ణయం కోసం ఇప్పటికే అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించామని వెల్లడించింది.
ట్రంప్‌నకు అమెరికా కోర్డు షాక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



