పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలి: వాసుదేవరెడ్డి డిమాండ్

– విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి
– ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి
నవతెలంగాణ – శంకరపట్నం
అన్నదాతలకు, వ్యవసాయ పంటల దిగుబడి కి ఎంతగానో ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో లేక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్నారని వెంటనే విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని సీపీఐ(ఎం) పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జీలుగ,జనుము,విత్తనాల కోసం అధికారులు జిల్లాకు ఆరువేల క్వింటాల్ విత్తనాలు అవసరమని ఇండెంట్ పెడితే కేవలం జిల్లాకి ఇప్పటివరకు 1100 కింటాలు మాత్రమే సరఫరా చేశారని, అవి ఏ మూలకు సరిపోలేదని అన్నారు. పచ్చిరొట్ట ఎరువుతో రైతాంగానికి పంట దిగుబడి పెరగడమే కాక ఎరువుల అవసరం తగ్గుతుందన్నారు. పత్తి విత్తనాలు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారని, వారిపై నిఘా పెట్టి  కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సన్నా చిన్నకారు రైతాంగానికి ఎరువులు పురుగుమందులు పనిముట్లు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ.5000 రూపాయలు పెన్షన్ ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తుందన్నారు. రైతాంగానికి రెట్టింపు ఆదాయం సమకూర్చుతామని వాగ్దానం చేసిన బిజెపి అందుకు భిన్నంగా వ్యవహరించడం మూలంగా రైతులు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, ఎం ఎస్ పి కి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలులో కూలీలకు పనిముట్లు , వేసవి అలవెన్స్, పని ప్రదేశంలో కనీస వసతులు, రోజుకు రూ.600 రూపాయలు కూలీలకు ఇవ్వాలని గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమై ఇప్పటికి 18 సంవత్సరాలు గడుస్తున్నా నేపథ్యంలో జిల్లాలోని కూలీలకు చట్టంలో పేర్కొన్న విధంగా పనిముట్లు పార గడపార తట్టలు ఇవ్వడం లేదని వెంటనే ఇవ్వాలన్నారు,ఉపాధిహామీ పని ప్రదేశంలో త్రాగునీరు, ఎండ నుండి రక్షణకు టెంటు చిన్నపాటి ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్టు సమకూర్చాలని చట్టం నిర్దేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కూలీలకు సమకూర్చడం లేదన్నారు. కొలతలు సకాలంలో చేయడం లేదనీ,150 మందిని ఒక గ్రూప్ చేయడం వల్ల పనిచేసిన వారికి సరైన వేతనం పడటం లేదన్నారు. ప్రతి వారం కూలీలకు పేస్లిప్పులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కడ కూడా సకాలంలో కూలీలకు పే స్లిప్పులు అందజేయడం లేదన్నారు. గతంలో ఎండ తీవ్రత వల్ల నాలుగు నెలలకు కూలీలకు చేసిన పనికి అదనంగా 30% డబ్బులను కలిపి ఇచ్చే విధానాన్ని కూడా రద్దు చేయడం వల్ల కూలీలకు శ్రమకు తగ్గ కూలీ డబ్బులు అందడం లేదన్నారు.  గతంలో అవలంబించిన విధానాన్ని పునరుద్ధరించాలని వేసవి అలవెన్స్ ఇవ్వాలని సంవత్సరంలో కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పిస్తూ రోజుకు రూ.600 రూపాయలు దినసరి కూలి ఇవ్వాలని పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, జాబ్ కార్డు కోరిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డును జారీ చేస్తూ తక్షణమే పని కల్పించుటకు తగు చర్యలు తీసుకోవాలని  కోరారు. గతంలో కేంద్ర బడ్జెట్లో తగ్గించిన 25వేల కోట్ల రూపాయలు తిరిగి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించి విడుదల చేయాలని వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు వెల్మారెడ్డి రాజిరెడ్డి, నాయకులు గుండేటి వాసుదేవ్ లు పాల్గొన్నారు.
Spread the love