Thursday, June 11, 2026
E-PAPER
Homeజాతీయంవీబీ- గ్రామ్‌ ‌జీకి తాత్కాలిక కేటాయింపులు

వీబీ- గ్రామ్‌ ‌జీకి తాత్కాలిక కేటాయింపులు

- Advertisement -

రూ.95,692 కోట్లలో బీజేపీ పాలిత రాష్ట్రాలకే అత్యధికం
యూపీకి రూ.9,721 కోట్లు.. పశ్చిమ బెంగాల్‌‌కు రూ.8,508 కోట్లు
తెలంగాణకు రూ.3825 కోట్లు.. ఏపీకి రూ.7702 కోట్లు

న్యూఢిల్లీ : వికసిత్‌ ‌భారత్‌ ‌గ్యారంటి ఫర్‌ ‌రోజ్‌‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ) (వీబీ- గ్రామ్‌ ‌జీ) కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్రం రూ.95,692.31 కోట్ల తాత్కాలికంగా నిధుల కేటాయింపును ప్రకటించింది. అయితే ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలకు సింహ భాగం కేటాయించింది. యూపీకి అత్యధికంగా రూ.9,721.48 కోట్లు రాగా, పశ్చిమ బెంగాల్‌ ‌రూ.8,508 కోట్లు అందుకోనుంది. ఇతర రాష్ట్రాలకు వాటి అవసరాలు, గత వ్యయాల ఆధారంగా నిధులు కేటాయించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) ‌స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ఈ వీబీ- గ్రామ్‌ ‌జీ తీవ్ర వివాదాన్ని రాజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీని అమలుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలవారీగా ఈ తాత్కాలిక కేటాయింపులు జరిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎంజీఎన్‌ఆర్‌‌జీజీఎస్‌ ‌కింద రాష్ట్రాలు చేసిన ఖర్చును ప్రాతిపదికగా తీసుకొని ఈ తాత్కాలిక కేటాయింపులు జరిగాయని శివరాజ్‌ ‌సింగ్‌ చౌహాన్‌ ‌తెలిపారు.

ఇటీవలే ముసాయిదా నిబంధనలు విడుదల
ఇటీవలే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త వీబీ-గ్రామ్‌ ‌జీ చట్టం అమలుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ పథకం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తుది నిబంధనలు ఇంకా అమల్లోకి రాకముందే రాష్ట్రాలకు నిధుల ప్రవాహం ఆగిపోకుండా ఉండేందుకు ఈ మధ్యంతర కేటాయింపులు జరిపినట్టు సమాచారం. కొత్త పథకం కింద రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి 16వ ఆర్థిక సంఘం సూచించిన ప్రమాణాలను అనుసరించాలని ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్నారు. జనాభా అభివృద్ధి స్థాయి, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలు భవిష్యత్తు కేటాయింపుల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.

​రాష్ట్రాలపై ఆర్థిక భారం
అయితే కొత్త పథకం అమలులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో కార్మికుల వేతన భారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ వీబీ- గ్రామ్‌ జీ పథకం కేంద్ర ప్రాయోజిత పథకంగా మారింది. ఇందులో కేంద్రం-రాష్ట్రాల మధ్య వ్యయభారం 60:40 నిష్పత్తిలో ఉండనుంది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలకు 90:10 నిష్పత్తి వర్తించనుంది. శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో మాత్రం మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. అయితే మోడీ సర్కారు తీసుకొచ్చిన ఈ మార్పుతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడనుంది. ఈ నేపథ్యంలో కొత్త పథకం అమలు ఎలా సాగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

​టాప్‌-10 ‌రాష్ట్రాలు
వీబీ- గ్రామ్‌ ‌జీ కింద తాత్కాలిక నిధుల కేటాయింపులో బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే అధిక మొత్తంలో దక్కాయి. యూపీ, పశ్చిమ బెంగాల్‌ ‌తర్వాతి స్థానాల్లో ఏపీ, తమిళనాడు, రాజస్తాన్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక మహారాష్ట్ర, తెలంగాణలు ఉన్నాయి. ఏపీకి రూ.7702.21 కోట్లు కేటాయించగా, తెలంగాణకు 3,825.31 కోట్లు దక్కాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -