Thursday, June 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండ్రైవింగ్ పరీక్షల్లో అక్రమాలపై నిఘా

డ్రైవింగ్ పరీక్షల్లో అక్రమాలపై నిఘా

- Advertisement -

సీసీ కెమెరాల నిఘాలో డ్రైవింగ్‌ ట్రాక్‌లు అక్రమాలకు పాల్పడితే వేటు తప్పదు
ఏజెంట్ల నియంత్రణకు కఠిన నిబంధనలు రహస్య సంకేతాలపై ఉక్కుపాదం

నవతెలంగాణ-సిటీబ్యూరో

రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్ పరీక్షల నిర్వహణలో అక్రమాల నివారణకు రవాణా శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అర్హత లేకపోయినా లైసెన్సులు జారీ చేయడం, దళారుల ప్రమేయం, అధికారుల పర్యవేక్షణ లోపం వంటి అంశాలపై ‌కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో అవకతవకలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) ఎం.చంద్రశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు.

అభ్యర్థి రాకుండా లైసెన్స్ ఇస్తే..
డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే అభ్యర్థి స్వయంగా ట్రాక్ వద్దకు రావాల్సి ఉంటుంది. కానీ చాలా చోట్ల దరఖాస్తుదారులు రాకపోయినా లైసెన్సులు మంజూరు చేస్తున్నట్టు రవాణాశాఖకు ఫిర్యాదులు రావడంతో చర్యలకు ఉపక్రమించింది. ఎంవీఐ ఇన్‌‌చార్జీలు అభ్యర్థి ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డును స్వయంగా పరిశీలించి ధృవీకరించాల్సి ఉంటుంది. ​

పేరుకే పరీక్ష.. ఇక కుదరదు
డ్రైవింగ్ ట్రాక్‌పై స్టీరింగ్ పట్టుకుని కొద్ది దూరం నడిపితే ఉత్తీర్ణత ఇచ్చినట్టుగా పరిగణించొద్దని రవాణా శాఖ హెచ్చరించింది. వాహనాన్ని నియంత్రించడం, వెనక్కి తీయడం (రివర్సింగ్), లైన్‌ క్రమశిక్షణ, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అన్ని అంశాల‌నూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫలితాలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ప్రతి పరీక్షనూ సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించాలని, కెమెరాలను ఆపేయడం చేస్తే తీవ్ర దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని హెచ్చరించింది.

దళారులకు ‘నో ఎంట్రీ’
డ్రైవింగ్ ట్రాక్ పరిసరాల్లో ప్రయివేటు వ్యక్తులు, బ్రోకర్లు, డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. డ్రైవింగ్ ట్రాక్ ప్రవేశ ద్వారం వద్దే ప్రయివేట్ వ్యక్తులకు ప్రవేశం లేదని బోర్డులు ఏర్పాటు చేయాలి. సిబ్బంది ఎవరైనా దళారులతో కుమ్మక్కైనట్టు తేలితే విచారణ కూడా లేకుండా తక్షణమే సస్పెండ్ చేస్తారు.

‘కోడ్ లాంగ్వేజ్’పై చర్యలు
ఉన్నతాధికారులు లేదా ఏసీబీ బృందాలు తనిఖీలకు వస్తున్నప్పుడు సిబ్బంది ఒకరికొకరు రహస్య కోడ్ భాషలో సమాచారం ఇచ్చుకుంటున్నట్టు గుర్తించామని, అటువంటి పద్ధతులకు స్వస్తి పలకాలని అధికారులు ఆదేశించారు. సంకేతాలు, నెబర్లు లేదా ఇతర రహస్య మార్గాల ద్వారా హెచ్చరికలు పంపే విధానం కనిపిస్తే సంబంధిత ఇన్‌‌చార్జీలనే వ్యక్తిగతంగా బాధ్యులను చేయనున్నారు.

పారదర్శకతకు పెద్దపీట
ప్రతిరోజూ జరిగే పరీక్షల వివరాలను డిజిటల్, భౌతిక రిజిస్టర్లలో ఎప్పటికప్పుడూ నమోదు చేయాలని, ఏ రోజు రికార్డులు ఆ రోజే సరిపోల్చుకోవాని రవాణా శాఖ సూచించింది.
నెలవారీ నివేదికలను ప్రతి నెలా 15వ తేదీలోపు కమిషనర్ కార్యాలయానికి పంపాలని, రవాణా శాఖలో పారదర్శకతను పెంచడం ద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌జేటీసీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -