మేలో 40 శాతం క్షీణత : ఎఎంఎఫ్‌ఐ వెల్లడి
ముంబయి : స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిధుల ప్రవాహం భారీగా తగ్గింది. ఈ ఏడాది మే నెలలో ఈ విభాగంలోకి రూ.22,908 కోట్ల నిధులు మాత్రమే వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఎఎంఎఫ్‌ఐ) వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇదే కనిష్ఠం కావడం గమనార్హం. గడిచిన ఏప్రిల్‌లో రూ.38,440 కోట్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రాగా.. ఆ నెలతో పోలిస్తే నిధుల ప్రవాహం 40 శాతం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. మొత్తంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి మే నెలలో రూ.64,131 కోట్ల నిధులు తరలిపోగా.. అందుకు ప్రధాన కారణం డెట్ ఆధారిత ఫండ్స్ కేటగిరీ నుంచి ఏకంగా రూ.96,948 కోట్ల పెట్టుబడులు ఉపసంహరణకు గురికావడమే. అదే విధంగా ఏప్రిల్‌లో భారీగా నిధులను ఆకర్షించిన గోల్డ్ ఈటిఎఫ్‌ల నుంచి కూడా మే నెలలో రూ.725 కోట్ల నిధులు బయటకు వెళ్లిపోయాయి. ఈక్విటీ విభాగంలో పరిశీలిస్తే.. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.5,175 కోట్లు రాగా, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,945 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,385 కోట్లు చొప్పున పెట్టుబడులు వచ్చాయి. అయితే డివిడెండ్ ఈల్డ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ మాత్రం అవుట్ ఫ్లోలను ఎదుర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మొత్తం నిర్వహణ ఆస్తుల విలువ (ఎయుఎం) అంతకుముందు నెలలోని రూ.81.92 లక్షల కోట్ల నుండి మే చివరినాటికి రూ.81.6 లక్షల కోట్లకు స్వల్పంగా క్షీణించింది.



