వాహనాలకు, కేసీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదు

వాహనాలకు, కేసీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదు– ప్రతి విషయాన్ని ఇంటిలిజెన్స్‌ సీఎంకు చెప్పి చేయదు
– రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కవిత
నవతెలంగాణ- హన్మకొండ/ ములుగు
ముఖ్యమంత్రి, మంత్రుల భద్రతను ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం చూస్తుందని, ముప్పును దృష్టిలో పెట్టుకుని భద్రతను కేటాయిస్తారని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ నేత కవిత అన్నారు. కాన్వారు ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అంశమని, వాటికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. శనివారం హనుమకొండ బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో దాస్యం వినరు భాస్కర్‌ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత పదేండ్లలో తనకు ఇంత భద్రత, అంత భద్రత ఉండాలని కేసీఆర్‌ కోరలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వాహనాలను విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్‌ రెడ్డి వెటకారంగా మాట్లాడడం ఆయన గౌరవాన్నే తగ్గిస్తుందని అన్నారు. కాళేశ్వరం అంశంపై స్పందిస్తూ.. ఈ అంశంపై తమ పార్టీ వైఖరిని ఇప్పటికే వెల్లడించిందన్నారు. సీనియర్‌ నాయకులు కడియం శ్రీహరి స్పందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎంక్వయిరీ కమిటీ నివేదిక వచ్చిన తరువాత స్పందిస్తామని తెలిపారు. సింగరేణి ఎన్నికలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆ ఎన్నికల్లో పోటీ చేయొద్దని తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి సంస్థ ఎదుగుదల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేయాలని తాము పిలుపునిచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘాన్ని కాకుండా సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీని కార్మికులు గెలిపించుకున్నారన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి టీబీజీకేఎస్‌ నాయకులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్‌ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వారెందుకు అలా మాట్లాడారో పార్టీలో నిర్ణయించి చర్యలు తీసుకుంటారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి, ఎన్నికల్లో లబ్ది పొందిందని, హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన వాగ్దానం అమలు చేయడానికి వందరోజుల సమయం ఇవ్వాలని మా నాయకుడు కోరాడని అప్పటివరకు మేము సమయమనం పాటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్‌, శంకర్‌ నాయక్‌, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, నేతలు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, సుందర్‌ రాజు యాదవ్‌, దాస్యం విజరు భాస్కర్‌, జనార్దన్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.
మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తించాలి
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా బీజేపీ ప్రభుత్వం గుర్తించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. అదేవిధంగా అనేక అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఆమె సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక-సారలమ్మలకు పసుపు, కుంకుమ, పూలు,పండ్లు మొక్కులు చెల్లించారు. పూజారులు శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలన్నారు. గత జాతరలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సకల సౌకర్యాలు కల్పించామని ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్‌ సహకారంతో ట్రైబల్‌ యూనివర్సిటీ రాష్ట్రానికి రావడం సంతోషకర మన్నారు. అందుకోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లు ఇచ్చి యూనివర్సిటీకి కావలసినటు వంటి భూములను సమకూర్చిందన్నారు. రూ. 850 కోట్లతో ఇప్పుడు యూనివర్సిటీని నిర్మాణాన్ని చేపట్టడం గర్వకారణమన్నారు. చెడు తొలగిపోయి నూతన సంవత్సరంలో శుభం కలగాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్‌, ములుగు జడ్పీ చైర్‌ పర్సన్‌ నాగజ్యోతి, ఎంపీపీ వాణిశ్రీ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love