బాధితులు అభద్రతాభావానికి లోనుకావొద్దు

Victims should not feel insecure– కష్టసుఖాల్లో ఎల్లవేళలా అండగా సీపీఐ(ఎం) ఉంటుంది : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఎన్జీవోస్‌ కాలనీ
రద బాధితులు అభద్రతాభావానికి లోనుకావొద్దని, మీ కష్టసుఖాల్లో సీపీఐ(ఎం) అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హన్మకొండ పట్టణంలో ముంపునకు గురైన గుడిసెవాసులను పరామర్శించారు. వారికి సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కార్యాలయంలో బెడ్‌ షీట్స్‌ పంపిణీ చేశారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. జిల్లాలో వారం రోజులుగా కురిసిన వర్షాలకు స్థానిక భూపోరాటాల్లోని చాలా మంది ఆశ్రయం కోల్పోయారన్నారు. గుడిసెల్లోకి వరద నీరు వచ్చి బియ్యం, నిత్యావసర సరుకులు, బట్టలు తడిచి పూర్తిగా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బీభత్సం కారణంగా నగరం అతలాకుతలమై పలు కాలనీల్లో ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని, వారందరినీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. దెబ్బతిన్న రోడ్లు, కాలువలు, కట్టలు మరమ్మతులు చేయాలని కోరారు. కాలువలు ఆక్రమించి నిర్మించిన వాటిని తొలగించాలని, భవిష్యత్తులో వరద నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సూదర్శన్‌, జిల్లా కన్వీనర్‌ చక్రపాణి, జిల్లా నాయకులు ఎస్‌.వాసుదేవరెడ్డి, జి.ప్రభాకర్‌ రెడ్డి, ఎం.చుక్కయ్య, టీ.ఉప్పలయ్య, గొడుగు వెంకట్‌, మంద సంపత్‌, కె.లింగయ్య, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love