విశాఖ వండర్‌ నితీశ్‌ కుమార్‌

 Visakha wonder Nitish Kumar– ఐపీఎల్‌తో వెలుగులోకి తెలుగు తేజం
– అందరి దృష్టిని ఆకర్షించిన సన్‌రైజర్స్‌ స్టార్‌
– నయా ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో తెలుగు అభిమానులు ఏండ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చిక్కింది. 2009లో డెక్కన్‌ చార్జర్స్‌, 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచినా జట్టులో మనోళ్లు లేరనే అసంతృప్తి తెలుగు అభిమానులను పీడిస్తూనే ఉంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను తెలుగు అభిమానులు సొంతం చేసుకున్నా.. ఈ ప్రాంతం క్రికెటర్లను ఆరెంజ్‌ ఆర్మీ యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది తెలుగు క్రికెటర్లు హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించినా.. ఆశించిన ప్రభావం చూపించటంలో విఫలమయ్యారు.
ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ శిబిరంలో ఓ తెలుగు తేజం సత్తా చాటుతున్నాడు. విశాఖ కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఏదో జట్టులో చోటు దక్కించుకున్నామా.. ఆడామా.. అన్నట్టు కాకుండా జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించే స్థాయికి ఎదిగాడు. ఐపీఎల్‌ 17 సీజన్‌లో ఆడింది రెండు మ్యాచులే అయినా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి తన తఢాఖా చూపించాడు. బ్యాట్‌తో, బ్యాట్‌తో, మెరుపు ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి భవిష్యత్‌లో భారత్‌కు పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఆడేందుకు అడుగులు వేస్తున్నాడు.
నవతెలంగాణ క్రీడావిభాగం
సంప్రదాయ బ్యాటర్‌ నుంచి
20 ఏండ్ల నితీశ్‌ కుమార్‌ రెడ్డి సంప్రదాయ బ్యాటర్‌. 2023 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శిబిరంలో చేరిన నితీశ్‌ నిరుడే ఐపీఎల్‌ అరంగ్రేటం చేశాడు. కానీ అంచనాలను అందుకోలేదు. గత ఏడాది సన్‌రైజర్స్‌ జట్టులో నితీశ్‌ పాత్ర సైతం సంప్రదాయ బ్యాటింగే. కానీ ఈ ఏడాది నితీశ్‌ సామర్థ్యం సన్‌రైజర్స్‌ కోచింగ్‌ సిబ్బంది గుర్తించారు. దీంతో నితీశ్‌ సైతం తన బ్యాటింగ్‌ స్టయిల్‌ను మార్చుకున్నాడు. సంప్రదాయ బ్యాటర్‌ నుంచి ధనాధన్‌ బ్యాటర్‌గా రూపాంతరం చెందాడు. ఫలితమే ఐపీఎల్‌ 17లో ఆడిన రెండు మ్యాచుల్లో పరుగుల ప్రవాహం. చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఛేదనలో ఓ సిక్సర్‌, ఫోర్‌తో అజేయంగా 14 పరుగులు చేసిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. ఆ ఆత్మవిశ్వాసం పంజాబ్‌ కింగ్స్‌పై కొనసాగించాడు. 37 బంతుల్లో 64 పరుగులు జోడించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊహించిన స్కోరు కట్టబెట్టాడు. పంజాబ్‌ కింగ్స్‌పై హర్‌ప్రీత్‌ బరార్‌తో పాటు ప్రపంచ శ్రేణి నాణ్యమైన పేసర్లు కగిసో రబాడ, శామ్‌ కరన్‌లపై అలవోకగా సిక్సర్లు సంధించిన తీరు అమోఘం. సన్‌రైజర్స్‌ నుంచి ఇప్పటికే అభిషేక్‌ శర్మ ధనాధన్‌ దంచికొడుతుండగా.. ఇప్పుడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి సైతం విధ్వంసక బ్యాటర్ల జాబితాలో చేరాడు.
అరుదైన ఆల్‌రౌండర్‌!
‘స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా రాణిస్తూ.. పేస్‌ బౌలింగ్‌ చేయగల ఆటగాడు. అరుదైన క్రికెటర్‌’ అంటూ భారత క్రికెటర్‌, ఆంధ్ర మాజీ కెప్టెన్‌ హనుమ విహారి గతంలో నితీశ్‌ గురించి ఓ పోస్ట్‌ పెట్టాడు. గత మూడు సీజన్లుగా రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు కీలకంగా మారిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. గత రెండు సీజన్లలో 25కి పైగా వికెట్లతో ఆంధ్ర తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన పేసర్‌గా నిలిచాడు. ఈ ఏడాది రంజీ సీజన్‌లో సైతం 350కి పైగా పరుగులు రాబట్టాడు. అదే జోరు ఇప్పుడు ఐపీఎల్‌లోనూ చూపిస్తున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో బంతి అందుకోని నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. ముల్లాపూర్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై తన పేస్‌ పవర్‌ చూపించాడు. మూడు ఓవర్లలో ఓ వికెట్‌ పడగొట్టి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేశాడు.
హార్దిక్‌ మాటలతో స్ఫూర్తి
నితీశ్‌ కుమార్‌ రెడ్డి కెరీర్‌ తొలినాళ్లలో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌. విరాట్‌ కోహ్లి అభిమాన క్రికెటర్‌. 2018లో అండర్‌-16 విభాగంలో అత్యుత్తమ క్రికెటర్‌ అవార్డును దక్కించుకున్నాడు. అప్పుడు కోహ్లిని కలుసుకునే ప్రయత్నం చేయగా సెక్యూరిటీ సిబ్బంది కారణంగా సాధ్యపడలేదని నితీశ్‌ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు. అండర్‌-19 క్రికెటర్‌గా బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్న సమయంలో నితీశ్‌ కుమార్‌ కెరీర్‌ గమనం మారిపోయింది. హార్దిక్‌ పాండ్య మాటలతో స్ఫూర్తి పొందిన నితీశ్‌ కుమార్‌ అప్పట్నుంచి పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగేందుకు చెమటోడ్చాడు. ఆంధ్ర జట్టుకు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మారిన నితీశ్‌ ఇప్పుడు సన్‌రైజర్స్‌కూ ఆ పాత్ర పోషిస్తున్నాడు. రానున్న కాలంలో భారత జట్టు తరఫున హార్దిక్‌ పాండ్యతో కలిసి ప్రాతినిథ్యం వహించాలనేది నితీశ్‌ కుమార్‌ రెడ్డి స్వప్నం. జూనియర్‌ క్రికెట్‌లో 2017-18లోనే రికార్డులు బద్దలు కొట్టిన నితీశ్‌.. సీనియర్‌ క్రికెట్‌లో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. విజరు మర్చంట్‌ ట్రోఫీలో నితీశ్‌ కుమార్‌ 76.41 సగటుతో 1237 పరుగులతో ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పాడు.
తనయుడి కోసం ఉద్యోగం వదిలేసి..
నితీశ్‌ కుమార్‌ రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. నితీశ్‌ తండ్రి ముత్యాల రెడ్డి. హిందూస్థాన్‌ జింక్‌ సంస్థలో ఉద్యోగి. నితీశ్‌కు 12-13 ఏండ్ల వయసులో ముత్యాలకు ఉదరుపూర్‌కు బదిలీ కాగా.. హిందీ బాష రాకపోవటంతో అక్కడికి వెళ్లాలా? వద్దా? అనే మీమాంసలో పడ్డారు. ఈ సమయంలో నితీశ్‌ కోచ్‌లు చెప్పిన మాటలతో ముత్యాల కఠిన నిర్ణయమే తీసుకు న్నాడు. క్రికెటర్‌ మంచి భవిష్యత్‌ ఉన్న కుమా రుడి కోసం, అతడి క్రికెట్‌ కెరీర్‌ కోసం విశాఖ లోనే ఉండిపోవాలని అనుకున్నాడు. ఉద్యోగం వదిలేసి నితీశ్‌ కుమార్‌ క్రికెట్‌ కెరీర్‌పై దృష్టి నిలిపాడు. జిల్లా క్రికెట్‌లో ప్రతిభ చాటిన నితీశ్‌ త్వరగానే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. 2023 ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో రూ.20 లక్షల ధరకు సన్‌రైజర్స్‌ గూటికి చేరాడు. నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా ఎదుగుతు న్న నితీశ్‌ .. వచ్చే ఏడాది ఐపీఎల్‌ వేలంలో రికార్డు ధర దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Spread the love