నాగపురి రమేశ్‌పై వేటు

National Anti-Doping Agency– అథ్లెట్లు డోప్‌ టెస్టు తప్పించుకునేందుకు సాయం!
– జాతీయ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: అథ్లెటిక్స్‌ జాతీయ జూనియర్‌ జట్టు చీఫ్‌ కోచ్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్‌పై నాడా (నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ) వేటు వేసింది. హైదరాబాద్‌లోని సారు సెంటర్‌లో శిక్షణ ఇస్తున్న నాగపురి రమేశ్‌.. ఇటీవల నాడా అధికారులు అథ్లెట్ల శాంపిల్స్‌ సేకరణ సమయంలో ఇద్దరు అథ్లెట్లు టెస్టు శాంపిల్స్‌కు ఇవ్వకుండా ఉండేందుకు సహాయం చేసిన ఆరోపణలతో నాగపురి రమేశ్‌పై నిషేధం విధించింది. మరో ఇద్దరు కోచ్‌లు కరమ్‌వీర్‌ సింగ్‌, రాకేశ్‌లపై సైతం దాదాపుగా ఇటువంటి ఆరోపణలతోనే నాడా వేటు వేసింది. నాడా టెస్టులకు ఉద్దేశపూర్వకంగా దూరమైన ఏడుగురు అథ్లెట్లను సైతం నాడా వదల్లేదు. పారాస్‌ సింఘాల్‌, పూజ రాణి, నాలుబోతు షణ్ముగ శ్రీనివాస్‌, చెలిమి ప్రత్యుష, శుభమ్‌ మహార, కిరణ్‌, జ్యోతి ఈ జాబితాలో ఉన్నారు. సింఘాల్‌ 2024 ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో 2000 మీ స్టీపుల్‌ఛేజ్‌లో విజేతగా నిలువగా.. శ్రీనివాస్‌ ఫెడరేషన్‌ కప్‌, జాతీయ చాంపియన్‌షిప్స్‌ 2024లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. జాతీయ అథ్లెటిక్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) 2023లో నాగపురి రమేశ్‌ను జాతీయ జూనియర్‌ చీఫ్‌ కోచ్‌గా నియమించింది. ఈ అంశం నాడా పరిధిలోకి వస్తుందని, రమేశ్‌పై నిషేధం అంశంలో స్పందించేందుకు ఏఎఫ్‌ఐ వర్గాలు నిరాకరించాయి. ‘ ఈ అంశంలో స్పందించాలని అనుకోవటం లేదు. భారత అథ్లెటిక్స్‌కు నా శక్తి మేరకు పని చేస్తున్నాను’ అని నాగపురి రమేశ్‌ అన్నాడు. పారిస్‌ పారాలింపిక్స్‌ పతక విజేత దీప్తి జీవాంజి సహా ద్యుతి చంద్‌కు నాగపురి రమేశ్‌ కోచ్‌గా వ్యవహరించారు. ద్యుతీ చంద్‌ డోపింగ్‌ కేసులోనే ప్రస్తుతం నాలుగేండ్ల నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Spread the love