వ్యయం రూ.9.48 లక్షల కోట్లు
ప్రతీ అమెరికన్ కుటుంబంపై 500 డాలర్ల బిల్లు
యుద్ధం లెక్కలను అమెరికా దాచిపెడుతోంది
నెతన్యాహు ఆడిన జూదంలో అమెరికా పాచికగా మారింది
ఇజ్రాయెల్ ఫస్ట్ అంటే అమెరికా లాస్ట్- ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ
టెహ్రాన్: తమ దేశంతో యుద్ధానికి అమెరికా రూ.9.48 లక్షల కోట్లు (100 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఆడిన జూదంలో అమెరికా పాచికగా మారి 100 బిలియన్ డాలర్లను ఖర్చు చేసుకుందని ఆయన విమర్శించారు. యుద్ధం ఫలితంగా ప్రతీ అమెరికన్ కుటుంబం నెలవారీ ఖర్చుల బిల్లు రూ.47వేలు (500 డాలర్లు) చొప్పున పెరిగిపోయింది అబ్బాస్ అరాగ్చీ అన్నారు. అమెరికన్ పౌరులపై పరోక్షంగా మరింత భారం సైతం పడిందని తెలిపారు. ఈ లెక్కలన్నీ దాచి పెట్టేందుకు అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) యత్నిస్తోందని ఎద్దేవా చేశారు. మొత్తం మీద ఇజ్రాయిల్ ఫస్ట్ అంటే అమెరికా లాస్ట్ అనే విషయం ఈ యుద్ధంతో తేటతెల్లం అయిందన్నారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
అమెరికాకు మరోసారి ఇరాన్ ప్రతిపాదనలు
అమెరికాతో శాంతిచర్చల కోసం ఇరాన్ మరోసారి కొత్త ప్రతిపాదనలను పంపినట్టు తెలుస్తోంది. రెండు దశల ప్రణాళికతో కూడిన నూతన ప్రతిపాదనల డాక్యుమెంట్లను మధ్యవర్తు లుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ అధికార వర్గాలకు గురువారం (ఏప్రిల్ 30న) సాయంత్రం ఇరాన్ చేరవేసినట్టు సమాచారం. ఈమేరకు ఇరాన్ అధికారిక వార్తాసంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం, తొలుత హార్ముజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఇరాన్ కోరింది.
ఇక ఇదే సమయంలో శాశ్వత కాల్పుల విరమణను అమల్లోకి తేవాలని అమెరికాకు సూచించింది. కాల్పుల విరమణలో భాగంగా తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపడంతో పాటు సముద్ర మార్గాల భద్రతకు హామీ ఇవ్వాలని ఇరాన్ అంటోంది. ఇవన్నీ జరిగాక తదుపరి దశలోనే తమ అణ్వస్త్ర కార్యక్రమంపై అమెరికాతో చర్చలు జరుపుతామని ఇరాన్ స్పష్టం చేసింది. గత వారాంతంలో ఇరాన్ పంపిన మూడు దశల ప్రణాళికతో కూడిన ప్రతిపాదనలను అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దీంతో ఇప్పుడీ కొత్త ప్రతిపాదనలను ఇరాన్ పంపింది. నూతన ప్రపోజల్స్ ఇప్పటికే అమెరికా వైట్ హౌస్‌కు చేరినట్లు తెలిసింది. అయితే వాటిపై ట్రంప్ సర్కారు ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది.
ట్రంప్ చేతిలో చర్చల భవితవ్యం
ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనం ప్రకారం, ఇరాన్ కొత్త ప్రతిపాదనలు సైనిక ఘర్షణను ఆపే ఆశాకిరణంలా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో హార్ముజ్ జలసంధిని తెరవడం, యుద్ధాన్ని ఆపేయడం అనే అంశాలను ఇరాన్ సూటిగా ప్రతిపాదించింది. ఈ రెండు ప్రతిపాదనలు అమెరికా- ఇరాన్ శాంతిచర్చల ప్రక్రియలో సానుకూల పురోగతికి బాటలు వేస్తాయని అంచనా వేశారు. హార్ముజ్ జలసంధి మార్గం తెరుచుకొని, తమ ఓడరేవుల ముట్టడి ఆగాక అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరుపుతామని ఇరాన్ ప్రకటించింది. అయితే దీన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏ కోణంలో చూస్తారు? ఎలా స్పందిస్తారు? అనే అంశంపైనే చర్చల భవితవ్యం ఆధారపడి ఉంది.
ఇరాన్ ముట్టడి క్లిష్టతరమైన అంశం : ఎంబీ ఘాలిబఫ్
అమెరికాను ఎద్దేవా చేస్తూ గురువారం రోజు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఎంబీ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో పోలిస్తే ఇరాన్ సరిహద్దులు చాలా పొడవైనవని, అందువల్ల ఇరాన్ ముట్టడి అనేది అమెరికా అనుకుంటున్న దాని కంటే చాలా క్లిష్టతరమైన అంశమని ఆయన చెప్పారు. ఈసందర్భంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పైనా ఎంబీ ఘాలిబాఫ్ విమర్శలు చేశారు.
అమెరికా రెండు గోడలు వర్సెస్ ఇరాన్ బార్డర్
”ఒకవేళ పీట్ హెగ్సెత్ అమెరికాలోని పశ్చిమ తీరం నుంచి న్యూయార్క్ వరకు ఒక గోడను, లాస్ ఏంజెల్స్ నుంచి తూర్పు తీరం వరకు మరొక గోడను నిర్మిస్తే దాని పొడవు 7,755 కి.మీ ఉంటుంది. అయినప్పటికీ ఆ పొడవు అనేది ఇరాన్ మొత్తం బార్డర్ విస్తీర్ణం కంటే దాదాపు 1000 కి.మీ తక్కువే ఉంటుంది. ఇంత పెద్ద బార్డర్‌ను కలిగిన ఇరాన్‌ను అమెరికా ముట్టడి చేయడం ఈజీ కాదు. అందుకే పీ.ఎస్ అంటే పీట్ హెగ్సెత్ : 1 కి.మీ లేదా 0.62 మైల్” అని పేర్కొంటూ ఎంబీ ఘాలిబఫ్ ట్వీట్ చేశారు.
ఈయూపై మరో 25 శాతం సుంకాలు
వాణిజ్య ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ పాటించట్లేదు
వచ్చే వారం అమెరికాకు దిగుమతయ్యే కార్లు, ట్రక్కులపై అదనపు టారిఫ్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్:యూరోపియన్ యూనియన్ (ఈయూ)వాణిజ్య ఒప్పందాన్ని పాటించడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఈయూ నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అదే సమయంలో అమెరికాలో తయారైన వాహనాలపై ఎలాంటి సుంకాలు ఉండవని, తద్వా రా దేశీయ ఉత్పత్తిని విస్తరించుకోవడానికి కంపె నీలను ప్రోత్సహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
సంపూర్ణ ఆరోగ్యంగా మొజ్తాబా ఖమేనీ
అమెరికా దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హతమయ్యారా? అసలు ఆయన బతికి ఉంటే.. బయట కనిపించడంలేదెందుకు? అని అమెరికా మీడియా పుకార్లను తెగ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా పుకార్లను ఇరాన్ సర్వోన్నత నాయకుడి కార్యాలయంలో అంతర్జాతీయ వ్యవహారాల ఉప మంత్రి, నిపుణుల సభ సభ్యుడు అయిన అయతొల్లా మొహ్సెన్ ఖోమీ తోసిపుచ్చారు. మొజ్తాబా ఖమేనీకి గాయాలైనప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పినట్టు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.కాగా, సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గురించి.. ‘అతను ఎందుకు హాజరు కావడం లేదు? అతను ఆడియో లేదా వీడియో సందేశం ఎందుకు పంపడం లేదు? అతన్ని సందర్శించిన వారు ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?’లాంటి ప్రశ్నలు వేసి తమ నుంచి విషయాల్ని రాబట్టడానికి శత్రువు వేసే ఒక ఎత్తుగడ అని అన్నారు.అమెరికా దాడిలో ఖమేనీకి గాయాయ్యాయి. ఇప్పుడు ఇరాన్ అధికారులు సర్వోన్నత నాయకుడి ప్రాణాలను కాపాడటంపై దష్టి సారించారు. ”ప్రస్తుతం భూమిపై దైవసాక్షిగా ఉన్న గౌరవనీయులైన నాయకుడి ప్రాణాలను కాపాడటమే మాకు అత్యంత ముఖ్యమైన విషయం. ఆయనకు గాయాలైనప్పటికీ, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనను షియాలకు ఒక నిధిగా కాపాడాడని నేను మీకు హామీ ఇస్తున్నాను అని ఖోమీ అన్నారు.
బాంబు దాడి జరిగిన భవనంలోనే మొజ్తాబా ఖమేనీ ఉన్నారు. అయితే చివరికి ఆయన ప్రాణాలతో బయటపడ్డారని ఖోమి ధవీకరించారు. పేలుడు జరగడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు, దైవ సంకల్పం వల్ల అతను ఆవరణలోకి వెళ్ళాడు. దేవుడు అతన్ని కాపాడాలని కోరుకున్నాడు అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఖమేనీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన వ్యవహారాలను చురుకుగా నిర్వహిస్తున్నారు. ఆయన తన ప్రత్యక్ష పర్యవేక్షణతో చర్చలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను పర్యవేక్షిస్తున్నారు అని ఖోమీ అన్నారు.
24 గంటల్లో ఇజ్రాయిల్‌కు 6500 టన్నుల సైనిక సామగ్రియుద్ధం వైపే ట్రంప్ అడుగులు ?
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ ఇరుదేశాల పరస్పర హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల వేళ అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు భారీగా సైనిక సామగ్రి చేరుకోవడం పలు అనుమా నాలకు తావిస్తోంది. ఇరాన్‌పై మరోసారి భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతోందనే సంకేతాలు కన్పిస్తు న్నాయి. ఇటీవల 24 గంటల వ్యవధిలోనే అమెరికా నుంచి 6500 టన్నుల సైనిక సామగ్రి అందినట్లు ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడిం చింది. రెండు కార్గో నౌకలు, పలు విమానా ల్లో ఈ సామగ్రి వచ్చింది. ఈ కార్గో నౌకలు అష్‌దోద్, హైఫా పోర్టుల్లో ఉన్నాయి. వీటిల్లో భూతల, గగనతల దాడులకు వినియోగించే ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మిలిటరీ ట్రక్కులు, జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్స్ వంటివి ఉన్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ పై తాము చేపట్టిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 1,15,600 టన్నుల సైనిక సామగ్రిని అమెరికా పంపించినట్టు ఇజ్రాయిల్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏ క్షణమైనా శత్రువులను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ పేర్కొనడం గమనార్హం.ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా స్వల్ప వ్యవధిలో అత్యంత శక్తిమంతమైన దాడులు చేయాలని ఈ ప్లాన్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ తరహా దాడులతో టెహ్రాన్ చర్చలకు రాక తప్పని పరిస్థితి ఉంటుందని అమెరికా భావిస్తోంది. కానీ ఇరాన్ కూడా ట్రంప్ ,నెతన్యాహు యుద్ధ నీతికి చెక్ పెట్టేలా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో మళ్లీ భీకర స్థాయిలో దాడులు జరుగు తాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



