Tuesday, June 30, 2026
E-PAPER
Homeఆటలుహెచ్‌‌సీఏ మెంటార్‌‌గా 
వసీం జాఫర్‌

హెచ్‌‌సీఏ మెంటార్‌‌గా 
వసీం జాఫర్‌

- Advertisement -

ఎనిమిది జిల్లాల్లో మౌలిక సదుపాయాలు
క్రికెట్‌ డైరెక్టర్‌ అంబటి రాయుడు వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌

దేశవాళీ క్రికెట్‌ ‌దిగ్గజం వసీం జాఫర్‌ (48) రెండేండ్ల పాటు హైదరాబాద్‌‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌‌సీఏ) క్రికెట్‌ ‌వ్యవహారాలను పర్యవేక్ష‍ించనున్నాడు. 2026-27 సీజన్‌ ‌నుంచి వసీం జాఫర్‌ ‌హెచ్‌‌సీఏ మెంటార్‌‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సీనియర్‌, జూనియర్‌ ‌క్రికెట్‌ ‌టోర్నమెంట్లకు హెచ్‌‌సీఏ జట్లను జాఫర్‌ మెంటార్‌‌గా ఉండనున్నాడు. ఈ మేరకు హెచ్‌‌సీఏ క్రికెట్‌ డైరెక్టర్‌ అంబటి రాయుడు వెల్లడించాడు. సోమవారం ఉప్పల్‌ ‌స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌‌రెడ్డితో కలిసి మాట్లాడిన అంబటి రాయుడు ఈ మేరకు ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌ ‌సర్క్యూట్‌‌లో ముంబయికి ప్రాతినిథ్యం వహించిన వసీం జాఫర్‌.. కెరీర్‌ ఆఖర్లో విదర్భ తరఫున ఆడాడు. కెప్టెన్‌, కోచ్‌‌గా ద్విపాత్రాభినయంతో విదర్భను వసీం జాఫర్‌ ‌రంజీ ట్రోఫీ చాంపియన్‌‌గా నిలిపిన సంగతి తెలిసిందే.
జిల్లాల్లో అకాడమీలు, సీఓఈలు
హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా ఇతర ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో క్రికెట్‌ అకాడమీలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు అంబటి రాయుడు తెలిపాడు. ‌సెంట్రల్‌ ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌, సౌత్‌ ‌తెలంగాణలో ఒక్కో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. జగిత్యాల (నార్త్‌ ‌తెలంగాణ), నాగర్‌‌కర్నూల్‌ (‌సౌత్‌ ‌తెలంగాణ), సూర్యాపేట (సెంట్రల్‌ ఈస్ట్‌ ‌తెలంగాణ), జహీరాబాద్‌ (వెస్ట్‌ ‌తెలంగాణ)లలో బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా.. ఫస్ట్‌ ‌క్లాస్‌, టీజీ20 మ్యాచ్‌‌లు నిర్వహించేందుకు అనువుగా గ్రౌండ్‌, మౌలిక వసతులు కల్పించనున్నారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌‌నగర్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌‌లో జిల్లా క్రికెట్‌ అకాడమీ, గ్రౌండ్‌ ఏర్పాటు చేయనున్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ‌కోసం 15 ఎకరాలు స్థలం తీసుకోగా, క్రికెట్‌ అకాడమీల కోసం ఏడు ఎకరాల స్థలం తీసుకున్నట్టు తెలిపారు.
​ఇన్‌‌స్టిట్యూషన్ల ‌జట్లకు ప్రత్యేక విభాగం!
హైదరాబాద్‌‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ‌ఇన్‌‌స్టిట్యూషన్‌ క్లబ్‌‌లకు ఈ సీజన్‌ ‌నుంచి ప్రత్యేకంగా పోటీలు నిర్వహించనున్నారు. ఇన్‌‌స్టిట్యూషన్‌ ‌సభ్యులతో అంబటి రాయుడు ఆదివారం ఉప్పల్‌ ‌స్టేడియంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సభ్యుల నుంచి అందిన సూచనల ప్రకారం అన్ని ఇన్‌‌స్టిట్యూట్‌ ‌క్లబ్‌‌లు ఇక నుంచి ఇన్‌‌స్టిట్యూషన్స్‌ ‌విభాగంలో ఆడనున్నాయి. ప్రస్తుతం డివిజన్‌-‌ఏలో ఆడుతున్న ఇన్‌‌స్టిట్యూషన్‌ ‌జట్లు ఈ ఏడాది ఈ విభాగంలో ఆడనుండగా.. వచ్చే ఏడాది ర్యాంకింగ్‌ ఆధారంగా ఇన్‌‌స్టిట్యూషన్స్‌ ఏ, బీ, సీ డివిజన్లలో ఆడతాయి.
​అక్టోబర్‌‌లో ఎన్నికలు
హెచ్‌‌సీఏ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్‌‌లో జరుగుతాయని ఆ సంఘం అధికార ప్రతినిధి శేషు నారాయణ తెలిపారు. ఉపాధ్యక్ష‍ుడు దల్జీత్‌ ‌సింగ్‌ ‌తాత్కాలిక ప్రెసిడెంట్‌‌గా 45 రోజులు కొనసాగేందుకు కోర్టు అనుమతించింది. ఓ ఏడాదిలో రెండు సార్లు నిర్వహించే ప్రసక్తి లేదు. ప్రస్తుత అపెక్స్‌ ‌కౌన్సిల్‌ ‌పదవీ కాలం అక్టోబర్‌‌లో ముగియనుంది. అప్పుడే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -