మేమే.. మేమే..!

అంతా మేమే…అది చేసింది మేమే…భవిష్యత్తులో చేసేది మేమే.. మీరేం చేసినా అది కరెక్టు కాదు. అది అలా కాదు..ఇలా చేయాలి. ఆ విధంగా చేయడం మీ చేతగానితనానికి నిదర్శనం. పదేండ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్‌ నేతల వాలకం తీరిది. పదేండ్లు ఏనాడైనా ఒకర్నైనా కలిస్తిరా? వారి సమస్యను వింటిరా? కోరింది చేస్తిరా? చివరకు ఇందిపార్కు వద్ద ధర్నాలకు అవకాశం ఉండదని చెప్పితిరి. అన్ని సమస్యలను మేమే పరిష్కరిస్తామంటిరి. ప్రగతి భవన్‌కు రానియ్యాకపోతిరి. సచివాలయానికి రాకుండా అడ్డుకుంటిరి. విత్తనాలు ఇవ్వకపోతిరి. ఎరువులు తేకపోతిరి. పెట్టుబడి ఇస్తిరి..నిమ్మలంగా ఉంటిరి. పరిశ్రమల స్థాపనపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తిరి. ఒప్పం దాలంటిరి, పెట్టుబడులు తెచ్చినంటిరి. ఏ ఊర్లో కంపెనీ పెట్టారో చెప్పరైతిరి. నిరుద్యోగులను గోసపెడితిరి. నోటి ఫికేషన్లు ఇవ్వకపోతిరి..ఏజీ పెరిగిపాయే..పిల్ల దొరక్క పాయే. పెద్దరోడ్లు ఏస్తిరి. ఊర్లు,తాండలను పట్టించుకోక పోతిరి. ఇప్పటికీ గర్భిణులను కావడిలో తీసుకరాబట్టిరి. కమిషన్లు, భూ దందాలు, లంచాలు, అవినీతి అందల మెక్కేలా చేస్తిరి. కార్మిక సంఘాలు ఉండవంటిరి..ఉద్యోగ సంఘాలతో చర్చలు లేవంటిరి. డీఏలు ఇవ్వకపోతిరి. ధర్నా చౌక్‌ లేదని చెప్పితిరి. అంబేద్కర్‌ విగ్రహం దగ్గర కూర్చొంటిరి. నినాదాలు ఇస్తిరి, పోతిరి. అమర నిరాహార దీక్ష అని బెదిరిస్తిరి. చేయకపోతిరి. అప్పులు చేస్తిరి…అమ్‌దాని రాకుండా పోతిరి.పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించక చేత్తిరి. చేసిన కష్టమంతా ప్రజలు వాటికి ఖర్చు చేస్తుంటిరి. ఇవన్నీ భరించలేక ప్రజలు ‘సాగనంపిరి’. ఇప్పుడేమో గగ్గోలు పెడుతుంటిరి.
-గుడిగ రఘు

Spread the love