మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం

మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం– నిరంకుశ కేసీఆర్‌ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలి
–  పదేండ్లలో కేసీఆర్‌ మోసం తప్ప చేసిందేమీ లేదు : మల్కాజిగిరి రోడ్‌ షోలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక
నవతెలంగాణ-మల్కాజిగిరి
రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశ ప్రభుత్వానికి ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ అన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రోడ్‌షోలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. డప్పు దరువులతో, బతుకమ్మ, బోనాలు, వివిధ నృత్యాలతో వేలాది మంది ప్రజలతో ఆనంద్‌ బాగ్‌ చౌరస్తా నుంచి మల్కాజ్‌గిరి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేస్తే, కెేసీఆర్‌ కుటుంబం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంందని అన్నారు. బడుగు బలహీన తరగతుల ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్‌ కుటుంబం తప్ప.. ప్రజలు బాగుపడలేదని చెప్పారు.
రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. మేము పాలకులము కాదు.. ప్రజల సేవకులమన్నారు. తెెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు అన్నింటిలో 30 శాతం కమీషన్‌ తీసుకున్న ఘనత కేసీఆర్‌ కుటుంబానికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారంటీలను తమ ప్రభుత్వం అధికారంలో రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ తెలంగాణకు చేసినదేమీలేదని, ప్రజలను మోసం చేస్తూ తన ఆస్తులను పెంచుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైందన్నారు. మల్కాజ్‌గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ.. మల్కాజిగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు.

Spread the love