అప్పు తెచ్చి కరెంటు ఇచ్చాం

We got a loan and gave electricity– కాంగ్రెస్‌కు పాలన చేతకావట్లేదు : మాజీ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘అప్పులు చేసి ప్రజలకు కరెంటు కష్టాలు తీర్చాం. దానిలో తప్పేముంది. కాంగ్రెస్‌ నేతలకు పాలన చేతకాక, అప్పులు చేశామని మమ్మల్ని పదే పదే ఆడిపోసుకుంటున్నారు’ అని మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారంనాడిక్కడి బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చి ఇరవై ఐదు రోజుల పైనే అవుతుంది. పథకాలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తుంటే వీళ్లు అప్పులు… అప్పులు అని పాడిందే పాడుతున్నారు’ అని విమర్శించారు. ‘వీటిపై అసెంబ్లీలో శ్వేత పత్రాలు పెట్టారు. మేం సమాధానం చెప్పాం. డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నల్గొండ జిల్లా పర్యటనలో మళ్లీ అవే అప్పుల గురించి చెబుతున్నారు’ అని ఆక్షేపించారు. అప్పు లేని రాష్ట్రాలు దేశంలోనే లేవు. దేశానికీ అప్పు ఉంది అని చెప్పారు. ‘కాంగ్రెసోళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అప్పులు అనే అన్నారు. అధికారంలోకి వచ్చాకా అదే మాట చెప్తున్నారు. దేశంలోని విద్యుత్‌ సంస్థలు అన్నీ అప్పుల్లోనే ఉన్నాయి’ అని అన్నారు. ‘2014లో విద్యుత్‌ రంగంలో కాంగ్రెస్‌ఱ మిగిల్చిన అప్పు రూ.22 వేల కోట్లు. అయినా 3 గంటలు కరెంటు ఇవ్వలేకపోయారు. అదే అప్పు ఇపుడు నాలుగు రెట్లు అయ్యింది. ఊరికే దాని గురించే మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని విమర్శించారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. అలాంటి విద్యుత్‌ ప్రాజెక్టులు దేశంలో 30కి పైగా నడుస్తున్నాయని చెప్పారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా లేని లోటును ప్రజలు అప్పుడే చర్చించుకుంటున్నారనీ, ప్రజా పాలన దరఖాస్తులో బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ ఇవ్వాలని ఎందుకు అడగ లేదని అని ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన మంత్రులు రౌడీల్లాగా మాట్లాడారనీ, అసెంబ్లీలో కూడా వారి తీరు అలాగే ఉందన్నారు. విద్యుత్‌ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దిన సీఎమ్‌డీ డీ ప్రభాకర్‌రావును అసెంబ్లీలో దుర్భాషలాడారనీ, సభలో లేని వ్యక్తిపై నిందలు వేయడం సరికాదన్నారు. మేం నిజాయితీగా ఉన్నాం కాబట్టే న్యాయ విచారణ కోరామని చెప్పారు. మంత్రులు అప్పుల గురించి మాట్లాడటం మానేసి, తమ శాఖలపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు.

Spread the love