టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గం పిలుపు
13న కలెక్టరేట్ల ఎదుట నిరసన
15న సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా
ఆగస్టు నెలాఖరులో రాష్ట్ర మహాసభలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) యాక్టింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య పిలుపునిచ్చారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఈ నెల 13న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసి నిరసన తెలిపాలని కోరారు. 15న రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్టు వారు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో రాంచందర్ అధ్యక్షత టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. జర్నలిస్టుల హెల్త్‌కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా రాంచందర్, పున్నయ్య అన్నారు. హెల్త్ కార్డులు నిమ్స్ ఆస్పత్రి మినహా ఏ ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ పని చేయడం లేదని తెలిపారు. వెంటనే జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోకపోవడంతో కార్యాచరణ ముందుకు సాగడం లేదని తెలిపారు. ఈ అంశంలో జర్నలిస్టులకు ఆశలు కల్పించిన ప్రభుత్వం ఆ తర్వాత వారి ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. అక్రిడిడేషన్ కార్డుల పంపిణీ ఆలస్యం చేయకుండా, అర్హులైన జర్నలిస్టులకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత జర్నలిస్టులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జులై నెలఖారు వరకు అన్ని జిల్లాల మహాసభలు పూర్తి చేసి, ఆగస్టు నెలఖారులో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని వారు చెప్పారు. మహాసభలను విజయవంతం చేసేందుకు రాంచందర్‌ను ఆహ్వాన సంఘం కన్వీనర్ గా రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకుంది. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఎల్గొయి ప్రభాకర్, తాటికొండ కృష్ణ, మానిక్ ప్రభు, గుడిగ రఘు, రాజశేఖర్, కార్యదర్శి సలీమ, చంద్రశేఖర్, నవీన్, అరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



