వారికి ప్రజలే బుద్ధి చెబుతారు
ఆర్థిక ఇబ్బందులున్నా..రైతు సంక్షేమానికే పెద్దపీట
జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి సీతక్క
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నవతెలంగాణ-డిచ్‌పల్లి/నిజామాబాద్‌సిటీ
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలవి చిల్లర రాజకీయాలని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. పేదలు సన్నబియ్యం తింటే ఆ పార్టీలకు కడుపు మండుతుందని ఆరోపించారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలంలో పలు అభివృద్ధి పనులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. డిచ్‌పల్లి మండలంలోని రాంపూర్ డీ తండా నుంచి ఇందల్‌వాయి మండలం వెంగల్‌పాడ్ తండా వరకు, కేకే తండా నుంచి మేఘ్యా నాయక్ తండా వరకు మధ్య బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తిర్మన్‌పల్లిలో రూ.5కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించకుండా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి విమర్శించారు. అధికారం కోల్పోయిన అక్కసుతో బీఆర్‌ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందనీ, బీజేపీ మతం, కులం పేరుతో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రోడ్లు, విద్య, గిరిజన సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో వరుసగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
అంతకుముందు వెంగళ్‌పహాడ్ సర్పంచ్ లావుడ్య మేన గంగాధర్, ఉప సర్పంచ్ మహిపాల్ నాయక్, కేకే తండా సర్పంచ్ లక్ష్మి వెంకట్రాం, తిర్మన్‌పల్లి సర్పంచ్ చింతల కిషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నిధులను మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే భూపతిరెడ్డికి పూలతో ఘన స్వాగతం పలికారు. తిర్మన్‌పల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రిని, ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బంజారా పాటలపై విద్యార్థినులతో కలిసి మంత్రి సీతక్క బంజారా జానపద గీతాలకు నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్‌రెడ్డి, గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మెన్ చంద్రశేఖర్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్‌బిన్ హందాన్, ఏఎంసీ చైర్మెన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మెన్ మునిపల్లి సాయరెడ్డి, తారాచంద్ నాయక్ పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులున్నా..రైతు సంక్షేమానికి పెద్దపీట
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రైతాంగ ప్రయోజనాలు కాపాడడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్దానంద్ గంజ్ (మార్కెట్ యార్డు)లో రూ.6.56 కోట్ల నిధులతో చేపడుతున్న షెడ్ల నిర్మాణాలు, మడిగెలు, సోలార్ విద్యుత్ తదితర పనులకు మంత్రి సీతక్క నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి తదితరులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో పేరెన్నికగన్న నిజామాబాద్ మార్కెట్ యార్డుకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు వీలుగా సీఎం, మార్కెటింగ్ శాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అర్హులైన హమాలీలకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్‌లు మంజూరు చేసేలా చొరవ చూపుతానని అన్నారు. హమాలీల కోసం ప్రత్యేకంగా బోర్డును ప్రకటించారని, ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి కనీస వేతనాలను ప్రకటించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మెన్ ముప్ప గంగారెడ్డి అధ్యక్షత వహించగా, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నగేష్‌రెడ్డి, ఏఎంసీ పాలకవర్గ ప్రతినిధులు, రైతులు, హమాలీలు, గుమాస్తాలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌వి చిల్లర రాజకీయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



