గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసింది
ఎమ్మెల్యే శంకర్ కృషితోనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కు
నిధులు : రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ -షాద్ నగర్
పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోయిందని ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆ ర్ కు అడ్రస్ లేకపోయినా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడని నమ్మి గెలిపించారని గుర్తు చేశారు. కానీ కేవలం తమ అవినీతి కోసం ఈ ప్రాజెక్టును వాడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 21 స్టేజీలు నీళ్లు దిగుమతి చేసుకుంటామంటూ.. కేవలం 18 స్టేజీలకు పరిమితం చేశారని, రూ.58 వేల కోట్లు మంజూరైతే.. కేవలం రూ.28 వేల కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారని విమర్శించారు. ప్రజా సంక్షేమం విషయంలో ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుందన్నారు. చివరికి తాము తప్పు చేసినా ప్రశ్నించాలని గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి సీఎంను కలవడం, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిని కలవడం, అనుకున్నది సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. బోర్లు వేసిన చుక్క నీరు రాని స్థితిలో ఉన్న పాలమూరుకు ప్రాజెక్టు అవసరం ఎంతగానో ఉందన్నారు.
ప్రస్తుతం రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో కలెక్టరేట్లలో సమావేశాల అనంతరం చర్చించి ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ నిర్వహించి, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేస్తామని అన్నారు. ఈ విషయంలో వీర్లపల్లి శంకర్ పట్టుదలతో ఉన్నాడని, సీఎం కూడా దీన్ని వదిలిపెట్టడని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతి లేకుండా, భూసేకరణ లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని గత ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. కాలేశ్వరం కోట్లు ఖర్చుపెట్టినా గత ప్రభుత్వం పాలమూరును ఎందుకు విస్మరించిందో యువత ప్రశ్నించి తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడూ సీఎం రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చర్చిస్తుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ అగ్గునూరు బస్వం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మున్సిపల్ వైస్ చైర్మెన్ అందే మోహన్, చెంది తిరుపతి రెడ్డి, పి.రఘు, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



