నిందితుడికి చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తాం

We will ensure that the accused is punished according to law– రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క
– పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఆరేండ్ల బాలికపై దాడి జరిగిన సంఘటనా స్థలం పరిశీలన
– బాధిత కుటుంబానికి రైస్‌ మిల్‌ నుంచి రూ.5.50 లక్షలు,
–  రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.2.50లక్షల నష్ట పరిహారం
–  చిన్నారి తండ్రికి ఉద్యోగం ఇస్తామని హామీ
నవతెలంగాణ – సుల్తానాబాద్‌
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి రైస్‌ మిల్లులో ఆరేండ్ల బాలికపై జరిగిన సంఘటన అమానుషమని, నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు దుదిళ్ల శ్రీధర్‌ బాబు, సీతక్క అన్నారు. ఆదివారం సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి గ్రామంలోని మమత ఇండిస్టీస్‌లో ఈనెల 14న ఆరేండ్ల బాలికపై దాడి జరిగిన సంఘటనా ప్రదేశాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, చింతకుంట విజయ రమణారావుతో కలిసి మంత్రులు పరిశీలించారు. రామగుండం సీపీ శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. చిన్నారి తల్లిదండ్రులు నిద్రపోయే సమయంలో రైస్‌ మిల్లులో పని చేసే బీహార్‌కు చెందిన వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర నుంచి పాపను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపారు. ఈ సంఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి దురలవాట్లకు గురైన వారు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసు శాఖ మరింత భద్రత కల్పన, నిఘా పెంపు, డ్రగ్స్‌ మాదక ద్రవ్యాలు, గంజాయిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలిక అదృశ్యంపై సమాచారం అందిన వెంటనే నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి తనిఖీలు చేసి విచారించి నిందితుడిని పట్టుకున్నారని తెలిపారు. చిన్నారి బాలికను ఆ కిరాతకుడు దారుణంగా హత్య చేయడమనేది ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించిందన్నారు. ఈ కేసులో నిందితుడికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో త్వరితగతిన శిక్ష పడే విధంగా ఆధారాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. బాధిత కుటుంబానికి సంబంధిత రైస్‌ మిల్లు నుంచి రూ.5.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో రూ.2.50లక్షలు చిన్నారి కుటుంబానికి అందించాలని నిర్ణయించారు.

Spread the love