గ్రామీణ మహిళలను కోటీశ్వరులను చేస్తాం

గ్రామీణ మహిళలను కోటీశ్వరులను చేస్తాం– పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
– సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామీణ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం, వారిని కోటీశ్వర్లుగా ఎదిగేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కింది, మూడో అంతస్తుల్లో రెండు మహిళా శక్తి క్యాంటీన్లను సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలనీ, దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అమ్మచేతి వంటలా మహిళా శక్తి క్యాంటీన్లు నాణ్యతకు మారుపేరుగా నిలవాలనీ, పల్లె రుచులు, ఇప్ప పువ్వు లడ్డూలు, నన్నారి వంటి సాంప్రదాయ ఆహార పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని సూచించారు. రెండేండ్లలో రాష్ట్రంలో 151 మహిళా శక్తి క్యాంటిన్లను ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నామన్నారు. స్థానికంగా లభ్యమయ్యే వనరులు, వస్తువుల ఆధారంగా, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మహిళా శక్తి బిజినెస్‌ మోడల్స్‌ రూపొందించి ముందుకెళ్తున్నామనీ, రానున్న ఐదేండ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామని హామీనిచ్చారు. ఇప్పటికే గుర్తించిన 17 వ్యాపారాల్లో మహిళా సంఘాలకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్యాంటీన్లు, సోలార్‌ ఉత్పత్తి, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, డెకరేషన్‌ ఫొటోగ్రఫీ, మీసేవ, ఆధార్‌ కేంద్రాలు, పౌల్ట్రీ, డెయిరీ నిర్వహణ, స్టార్టప్‌ కంపెనీలకు ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తుందనీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతుందని భరోసానిచ్చారు. గ్రామాల్లో జరిగే ఫంక్షన్లకు మహిళా సంఘాలు పిండివంటలు సరఫరా చేసే స్థాయికి ఎదగాలన్నారు. 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో మహిళా శక్తి కాంటీన్లను ప్రారంభించే పనులను వేగవంతం చేయాలని సీఎస్‌ శాంతి కుమారికి సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ముఖ్యమంత్రి కార్యదర్శులు మాణిక్‌ రాజ్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, సెర్ప్‌ డైరెక్టర్‌ గోపాల్‌ రావు, సెర్ప్‌ అదికారులు నర్సింహారెడ్డి, సునితారెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు.
సర్వపిండిని కొనుగోలు చేసిన మంత్రి సీతక్క
సచివాలయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్లు కార్పొరేట్‌ క్యాంటీన్లకు తీసిపోని విధంగా ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసిన రెండు క్యాంటీన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అందులో పిండివంటలు, చిరుతిళ్లు, స్వీట్లు, పొడులు, పచ్చల్లు, సర్వప్ప, సకినాలు, అరిసెల వంటి తెలంగాణ వంటపదార్థాలను విక్రయిస్తున్నారు. మంత్రి సీతక్క సర్వపిండిని కొనుగోలు చేశారు. మహిళా సంఘాల ఆతిథ్యాన్ని స్వీకరించి పిండివంటల రుచి చూశారు. పచ్చడితో గారెలను చూసి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు శిక్షణ ఇచ్చి క్యాంటిన్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించినందుకు మంత్రికి మహిళా సంఘాల సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

Spread the love