వారి ఆర్థిక స్వావలంబన
దిశగా చారిత్రాత్మక అడుగు
మహిళా శక్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
టీజీఎస్ఆర్టీసీకి లీజుకు మహిళా సంఘాల 553 బస్సులు..ప్రారంభించిన సీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆస్తుల యజమానులు, వ్యాపారవేత్తలు, సంపద సృష్టికర్తలు, ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలని, వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసిన 553 టీజీఎస్ఆర్టీసీ బస్సులను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించా రు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళలు సమాజంలో సగం, ఆకాశంలో సగం అని పేర్కొంటూ అభివృద్ధి ఫలితాలలో కూడా వారికి సమాన భాగస్వామ్యం ఉండాలన్నారు. మహిళలను రుణగ్రహీతల స్థాయి నుంచి ఆస్తుల యజమానుల స్థాయికి తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. మహిళా శక్తి కార్యక్రమం లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 553 మండల మహిళా సమాఖ్యలు రూ.199.08 కోట్ల పెట్టుబడితో 553 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి లీజుకు ఇచ్చాయని వెల్లడించారు.
ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 అద్దె లభిస్తుండగా, మొత్తం 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలకు నెలకు సుమారు రూ.3.84 కోట్ల ఆదాయం సమకూరు తోందని తెలిపారు. ఇప్పటివరకు రూ.20.34 కోట్లకు పైగా అద్దె ఆదాయం మహిళా సమాఖ్యలకు అందినట్టు చెప్పారు. ఈ బస్సులు కేవలం రవాణా వాహనాలు కావని, తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి, యాజమాన్య హక్కులకు ప్రతీకలని తెలిపారు. సంక్షేమం నుంచి సంపద సృష్టి వైపు మహిళలను తీసుకువెళ్లే ఆర్థిక విప్లవానికి ఇవి చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. మహాలక్ష్మి పథకం అమలులో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు 308 కోట్లకు పైగా మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని, మహిళలు సుమారు రూ.10,696 కోట్ల ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. మహిళా సంఘాలను రవాణా, వ్యవసాయం, మార్కెటింగ్, ఆహార ప్రాసెసింగ్, సేవారంగం, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.
మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు. నారాయణపేట జిల్లాకు చెందిన ఒక మహిళ స్వయం సహాయక సంఘం ద్వారా ఎదిగి పెట్రోల్ బంక్ యజమానిగా నిలిచిన ఉదాహరణను ప్రస్తావించారు. మహిళలకు శాశ్వత మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కార్పొరేట్ కార్యాలయాలకు సమానమైన సౌకర్యాలతో మహిళా శక్తి భవనాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక మార్కెటింగ్, వాణిజ్య మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చే లక్ష్యంతో 106 వాణిజ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ వ్యవస్థలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో మహిళా సంఘాలు మరింత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మహిళల పేరునే గృహాలు, ఇతర ఆస్తుల నమోదు జరుగుతున్నదని పేర్కొంటూ మహిళల ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, కుటుంబ స్థిరత్వానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలోనే అత్యంత విస్తృత మహిళా సాధికారత కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాలకు రూ.61 వేల కోట్లకు పైగా రుణాలు సమకూర్చడంతో పాటు దాదాపు రూ.2 వేల కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం భరించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా మహిళలను అక్షరాస్యత కార్యక్రమాలలో భాగస్వాములను చేశామని పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళా సంక్షేమాన్ని ఆస్తి యాజమాన్యంతో అనుసంధానించిన వినూత్న కార్యక్రమం ఇదని పేర్కొన్నారు. మహిళలను లబ్ధిదారుల నుంచి యజమానులుగా తీర్చిదిద్దిన చారిత్రాత్మక కార్యక్రమంగా ఈ బస్సుల పంపిణీ నిలుస్తుందన్నారు.
మహిళా సమాఖ్యలు, టీజీఎస్ఆర్టీసీ మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం మహిళల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి లేకుండా సమాజాభివృద్ధి సాధ్యం కాదన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, వ్యాపారాభివృద్ధి, ఆస్తి యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, మల్‌రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కలువ సుజాత గుప్తా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దాన కిషోర్, వికాస్ రాజ్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం. హరీష్ ముకుంద్ రెడ్డి, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, మహిళా సమాఖ్యల ప్రతినిధులు, అధికారులు , రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
మహిళలకు విరివిగా అవకాశాలిచ్చింది కాంగ్రెస్సే
మహిళా సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ పార్టీయే ప్రాధాన్యమిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఓటు హక్కు మొదలు కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ, సోనియాగాంధీలు నేతృత్వం వహించారని గుర్తుచేశారు. దేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి, మహిళలను ప్రధానమంత్రితో పాటు అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, అధ్యక్షులుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏర్పడి దాదాపు 50 ఏండ్లు అవుతున్నా …. ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఇప్పటి వరకు మహిళకు అవకాశమివ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మొదటి ఐదేండ్లలో మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకుండా చేసిందని గుర్తుచేశారు. మహిళా సంఘాలకు సంబంధించిన రూ.4 వేల కోట్ల జీరో వడ్డీ రుణాలను బీఆర్ఎస్ ఎగ్గొడితే మహిళలు ఆ పార్టీ నాయకులను ఫాంహౌజ్ కు పరిమితం చేశారని గుర్తుచేశారు.
మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటే కడుపులో విషం, కళ్లల్లో నిప్పులు పెట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని, ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేసేందుకు కుట్ర చేస్తే మహిళలే తిప్పికొట్టారన్నారు. బీఆర్ఎస్ నాయకులకు ఉన్న బాధేంటో తనకు అర్థం కావడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆడపిల్లల డ్రాపౌట్స్ తగ్గాయనీ, దూర ప్రాంతాలకు వెళ్లి చదివే వారి సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, సంఘాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించినా ఆగేది లేదని స్పష్టం చేశారు. మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు అధికారంలో ఉండి ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తామనీ, దళారులకు తెలంగాణలో అవకాశమివ్వబోమని స్పష్టం చేశారు. వడ్లు, మొక్కజొన్నలతోనే మన సమస్యలు తీరవనీ, పంట మార్పిడి అవసరమనీ, ఆ దిశగా రైతుల్లో అవగాహన పెంచే క్రమంలో మహిళా సంఘాలు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. కందులు, మినుములు, వివిధ రకాల పప్పుధాన్యాలు, కూరగాయల పంటలను ఉత్పత్తి చేయాల్సిన అవసరముందని తెలిపారు. .



