అవినీతి, కుటుంబ పార్టీలతో కలవబోం

– హైదరాబాద్‌ చుట్టుతా భూముల లావాదేవీల పై విచారణ జరపాలి
– బీజేపీ డైరీ ఆవిష్కరణలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అవినీతి, కుటుంబ పార్టీలతో తాము ఏనాడూ కలవలేదు..కలువబోమనీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు సమ దూరంలో ఉంటూ ఆ పార్టీల అక్రమాల చరిత్రను ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములకు సంబంధించిన అక్రమ లావాదేవీలపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ 2024 డైరీని ఆయన ఆవిష్కరించారు. తొలి డైరీని బీజేపీ పీఆర్‌ఓ పరమేశ్వర్‌కు అందజేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు అంకిరెడ్డి సుధీర్‌రెడ్డి, బొల్లపు సురేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలంతా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నేతల చేరికల కార్యక్రమాలుంటాయని తెలిపారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ స్థాయిలో యువకులు, రైతులు, రైతు కూలీలు, మహిళలను పార్టీలో చేర్పించాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. ప్రతి నాయకుడు 24 గంటల పాటు గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై, వారితో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు కేసీఆర్‌ కుటుంబం, ఎమ్మెల్యేల అవినీతిపై ఊరూరు వెళ్లి ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య డూప్‌ ఫైటింగ్‌ జరుగుతున్నదని చెప్పారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీకి అధిక స్థానాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love