– పిడమర్తి రవికి మతి భ్రమించడం వల్లే ఈ అసందర్భ వ్యాఖ్యలు
– పద్ధతి మార్చుకోకపోతే సత్తుపల్లిలో అడుగుపెట్టనీయం
– సండ్ర కుటుంబ సభ్యులపై పిడమర్తి రవి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత సండ్ర వెంకట వీరయ్యపై ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. బుధవారం స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ నాయకులు విలేకరులతో మాట్లాడారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని పిడమర్తిపై మండిపడ్డారు. ఎలాంటి సంబంధం లేని అంశాలను సండ్ర కుటుంబ సభ్యులకు ఆపాదిస్తూ మాట్లాడటం పిడమర్తి రవి దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. పిడమర్తి రవికి మతిభ్రమించడం వల్లే ఈ రకంగా ఆ సందర్భ ప్రేలాపనలు పేలుతున్నాడని విమర్శించారు. సైబర్ నేరాలపై పోలీసులు, న్యాయస్థానాలు వాస్తవాలు తేలుస్తాయని, దర్యాప్తు పూర్తికాకముందే వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్పష్టం చేశారు. తగిన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ, ఒక నాయకుడి ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని హితవు పలికారు.
తమకు కూడా మాట్లాడటం వచ్చని, అయితే కుటుంబాలను రాజకీయాల్లోకి లాగడం తమ సంస్కారం కాదని బీఆర్ఎస్ నాయకులు తేల్చి చెప్పారు. విమర్శలు చేసే ముందు పిడమర్తి రవి తన గత రాజకీయ ప్రస్థానాన్ని, తన స్థాయిని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కేవలం పబ్లిసిటీ కోసం ఫేమస్ కావాలనే ఉద్దేశంతోనే సండ్ర పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని, దీనివల్ల రవికే రాజకీయంగా నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేతల కుటుంబాల్లో ఏదైనా తప్పు జరిగితే, ఆ పార్టీ మొత్తాన్ని బాధ్యులను చేస్తామా అని నాయకులు ప్రశ్నించారు. వ్యక్తిగత తప్పులకు ఆ వ్యక్తులే బాధ్యత వహించాలి తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబాలను లాగడం సరైన విధానం కాదన్నారు. సండ్ర వెంకట వీరయ్య ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే సీనియర్ నాయకుడని, ఆయనపై అసత్య ఆరోపణలు, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే బీఆర్ఎస్ శ్రేణులు ఇకపై మౌనంగా ఉండబోవని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ నాయకులు పిడమర్తిని గట్టిగా హెచ్చరించారు
ఇకనైనా పిడమర్తి రవి బాధ్యతాయుతంగా వ్యవహరించి, వ్యక్తిగత దూషణలు మాని కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే పిడమర్తి రవిని సత్తుపల్లిలో అడుగుపెట్టనీయమని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి, మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు కట్టా అజయ్ కుమార్, కోటగిరి సుధాకరరావు, మల్లూరు అంకమరాజు ఎస్కే రఫీ, మారోజు సురేష్, దుగ్గిదేవర వెంకటలాల్, రెడ్డం వీర మోహన రెడ్డి, వీరపనేని అప్పారావు (బాబీ), పగుట్ల వెంకటేశ్వరరావు, చెక్కిరాల మోహనరావు, మోదుగు పుల్లారావు, మోరంపుండి ప్రభాకర్, ఆయూబ్ పాషా పాల్గొన్నారు.



