Friday, May 1, 2026
E-PAPER
HomeNewsఎక్సైజ్‌ పోలీసులకు ఆయుధ శిక్షణ

ఎక్సైజ్‌ పోలీసులకు ఆయుధ శిక్షణ

- Advertisement -

కానిస్టేబుల్‌ సౌమ్య హత్య ఘటనతో మారిన సిలబస్‌
మద్యం, బీర్ల తయారీపై అవగాహన కోసం కంపెనీల్లో క్షేత్రస్థాయి పర్యటనలుొ ఎక్సైజ్‌ అకాడమీలో కొత్తగా
115 మందికి శిక్షణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ఎక్సైజ్‌ పోలీసులకు ఇప్పటి వరకు ఆయుధాలు లేవు. కేవలం లాఠీలతోనే అక్రమ మద్యం తయారీదారులు, స్మగ్లర్లను ఎదుర్కోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 26న నిజామాబాద్‌ జిల్లాల్లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ గాజుల సౌమ్య గంజాయి స్మగ్లర్ల చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఎక్సైజ్‌ పోలీసులకు కూడా ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్‌-1 ద్వారా ఎంపికైన 30 మంది ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌లు, గ్రూప్‌-2 ద్వారా ఎంపికైనా 84 మంది ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఎక్సైజ్‌ ఆకాడమీలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి వీరి శిక్షణ కొనసాగుతోంది.

ముఖ్యంగా ఆయుధాల వినియోగంపై పోలీస్‌ అకాడమీ సహకారంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అదే సమయంలో మద్యం, బీర్ల ఉత్పత్తిపై సంపూర్ణ అవగాహన కోసం ఆయా పరిశ్రమల్లో క్షేత్రస్థాయి పర్యవేక్షణకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల కల్తీ మద్యం, ప్రభుత్వ సరఫరా మద్యంపై శిక్షణార్ధులకు అవగాహన పెరుగుతుంది. శిక్షణార్ధులకు ప్రత్యేకంగా మద్యం డిపోల్లో డ్యూటీలు వేయడం గమనార్హం. ఆయా హోదాలను బట్టి ఎక్సైజ్‌ పోలీసులకు తొమ్మిది, ఆరు, మూడు నెలల వరకు పోలీస్‌ ఆకాడమీ, ఎక్సైజ్‌ ఆకాడమీల్లో శిక్షణ ఇస్తున్నారు.

ఎక్సైజ్‌ ఆకాడమీలో ఇప్పటి వరకు 23 బ్యాచ్‌ల శిక్షణలు జరిగాయి. ఏఈఎస్‌, కానిస్టేబుళ్లు, ఎస్సైలకు వేర్వేరుగా శిక్షణలు ఉంటాయి. ప్రతి బ్యాచ్‌లో 100 నుంచి 120 మందికి శిక్షణ ఇస్తారు. థియరీ, ప్రాక్టిస్‌, వ్యాయామం, పెరేడ్‌, అన్‌అమ్డ్‌తో పాటు తాజాగా అయుధ శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎక్సైజ్‌ ఆకాడమీలో 129 మంది మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కానిస్టేబుల్‌ సౌమ్య హత్య ఘటన తర్వాత ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సీ హరికిరణ్‌ ఈ శిక్షణా కోర్సుల్లో మార్పులు తెచ్చారు. ఆబ్కారీలోని విభాగాలపై అధికారులతో శిక్షణ ఇచ్చిన అనంతరం వారికి టెస్టులు నిర్వహించి, వచ్చిన మార్కుల్ని బట్టి పోస్టింగులు ఇచ్చారు. త్వరలో ప్రస్తుతం ఎక్సైజ్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఏఈఎస్‌, ఎస్సైలకు పోస్టింగులు ఇవ్వనున్నారు. దీనికోసం పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొత్తగా చాలా నేర్చుకున్నాం : డాక్టర్‌ వీఎమ్‌ నివేదిత, ఏఈఎస్‌ ట్రైనీ
పోలీస్‌, ఎక్సైజ్‌ అకాడమీల్లో శిక్షణ అనంతరం అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాం. శారీరక, మానసిక స్థైర్యాన్ని పెంచుకోగలిగాం. రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి వంటి చట్టవ్యతిరేక మత్తు పదార్థాలను అరికట్టడానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. గ్రూపు-1లో ఎంపిక కావడం ఒక మైలు రాయి అయితే, శిక్షణ మాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
గొప్ప అవకాశం : వీ లక్ష్మణ్‌ అనంద్‌, ఏఈఎస్‌ ట్రైనీ
యూనివర్శిటీల్లో చదువుకుని గ్రూప్స్‌లో విజయం సాధించి, కొత్తగా ఉద్యోగంలో చేరడం, శిక్షణను సమర్థవంతంగా పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉంది. డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టడాన్ని సేవగా భావిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అనందంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -