బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమం

Welfare is only with BRS– మహిళలు, రైతులు, పింఛన్‌దారులే లక్ష్యొం అసైన్డ్‌ భూములకు హక్కులు
– దశలవారీగాఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు
– పేదలందరికీ రూ.5 లక్షల జీవిత బీమా
– ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు
– అర్హులైన పేదలకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌
– రైతు బంధు సాయాన్ని దశలవారీగా రూ.16 వేలకు పెంపు
– అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3 వేల భృతి : మ్యానిఫెస్టోను విడుదల చేసిన సీఎం కేసీఆర్‌
– కొత్త హామీలన్నింటినీ ఆర్నెల్లలో అమలు చేస్తామని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‘సంక్షేమ’ తాయిలాలను జనం మీదికి వదిలారు. ముఖ్యంగా ఓట్లు అత్యధికంగా ఉన్న మహిళలు, రైతులు, పింఛన్‌దారులే లక్ష్యంగా మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర సంపదను పెంచడం.. దాన్ని పేదలకు పంచడమనే విధానంతోనే తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత ఎన్నికల ప్రణాళికల్లో చెప్పని అంశాలను సైతం అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌… మంత్రులతో కలిసి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులను నేటి పరిస్థితులతో పోల్చి చెప్పారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లను ఆయన ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ‘బెస్ట్‌ పాలసీ’లను అమలు చేస్తోందని చెప్పారు. జయప్రదంగా అమలవుతున్న ఈ విధానాలను యధావిధిగా కొనసాగిస్తూనే, కాలానుగుణంగా వివిధ రంగాలకు ఉద్దీపనలిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌-2023 ఎన్నికల ప్రణాళికలో కొత్త హామీలను ప్రకటిస్తున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మీద ఒకేసారి భారం పడకుండా ఉండేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీటిని దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు.
మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు…
‘కేసీఆర్‌ బీమా- ప్రతి ఇంటికి ధీమా’ పథకం కింద రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు కలిగున్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎల్‌ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత బీమా. దీని ద్వారా దాదాపు 93 లక్షల కుటుంబాలకు లబ్ది.
ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు. ప్రస్తుతం రూ.2,016 ఇస్తుండగా, ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో దాన్ని రూ.3,016కు పెంచుతారు. ఆ తర్వాత ఏటా రూ.500ల చొప్పున పెంచుతూ ఐదేండ్లలో రూ.5,016 ఇస్తారు.
వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంపు. ప్రస్తుతం రూ.4,016 ఇస్తుండగా… దాన్ని తొలి ఏడాది రూ.5 వేలకు పెంచుతారు. ఐదేండ్లలో రూ.6,016కు పెంచుతారు.
ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి రూ.15 లక్షలకు పెంపు
సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు
ప్రతి నెల రూ.3 వేల చొప్పున భతి చెల్లింపు
అర్హులైన పేదలతోపాటు అక్రిడిటేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా
రైతు బంధు కింద ఇచ్చే సాయం మొత్తాన్ని రూ.16 వేలకు దశల వారీగా పెంపు. తొలి ఏడాది ఈ సాయాన్ని రూ.12వేల వరకు పెంచుతారు
‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ
దళిత బంధు, రైతు బీమా కొనసాగింపు
గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు. వారితోపాటు గిరిజనేతరులకు కూడా పట్టాల పంపిణీ. భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు
అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గానికి
ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు
మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు.
రాష్ట్రంలో అనాథల కోసం తీసుకొచ్చిన
ప్రత్యేక విధానాన్ని పక్కాగా అమలు చేయటం
ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌ (పాత పెన్షన్‌ విధానం) కోసం కమిటీ ఏర్పాటు. నివేదిక ఆధారంగా నిర్ణయం
అసైన్డ్‌ భూములకు హక్కుల కల్పించటం
మైనారిటీ సంక్షేమానికి నిధులు పెంపు

Spread the love