సహజ వాయువు దిగుమతులపై అమెరికా సంస్థతో
ఒప్పందానికి మోడీ సర్కార్ తహతహఆ సంస్థ దివాలా తర్వాత
ఖతార్‌తో అగ్రిమెంట్
దేశంపై పెరగనున్న ఆర్థిక భారం
న్యూఢిల్లీ : గత 12 సంవత్సరరాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పునరుద్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులు పెట్టకుండా విదేశాల నుంచి ఖరీదైన సహజ వాయువును కొనుగోలు చేస్తోంది. అధికార ఎన్డీఏ ప్రారంభంలో వేసిన అంచనాల ప్రకారం 2030 నాటికి భారత చమురు డిమాండ్ రెట్టింపు అవుతుంది. అదే కాలంలో బొగ్గు ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువగా, గ్యాస్ డిమాండ్ సుమారు మూడు రెట్లు పెరుగుతుంది. పునరుద్పాదక ఇంధన సామర్ధ్యం ఐదు రెట్లు పెరుగుతుందని, జల విద్యుదుత్పత్తి 55 శాతం మేర పెరుగుతుందని కూడా అంచనా వేసింది. అంతేకాదు…2023 నాటికి అన్ని త్రిచక్ర వాహనాలు, 2025 నాటికి ద్విచక్ర వాహనాలు, 2030 నాటికి మూడింట ఒక వంతు కార్లు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారతాయని కూడా చెప్పింది. 2032 నాటికి అణు విద్యుత్ సామర్ధ్యాన్ని మూడు రెట్లు పెంచుతానని హామీ ఇచ్చింది.
యూపీఏ విధానాలకు భిన్నంగా…
అయితే ఈ అంచనాలు వివిధ రంగాల నిపుణులను ఆశ్చర్యానికి గురిచేశాయి. వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చినప్పుడు చమురు వినియోగం ఎలా రెట్టింపు అవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. యూపీఏ పాలనలో సమగ్ర ఇంధన పత్రాలను రూపొందించారు. అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం శిలాజ ఇంధనాలు, అణుశక్తి, పునరుద్పాదక ఇంధనాల మధ్య సాధించాల్సిన సమతుల్యతను నిర్దేశించారు. అయితే ఎన్డీఏ పాలనలో ఇవన్నీ చెత్తబుట్టలోకి వెళ్లిపోయాయి. ఈ ప్రభుత్వానికి సమగ్రమైన ఆలోచన లేదని మాజీ ఆర్థిక కార్యదర్శి ఒకరు వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం ఏకకాలంలో శిలాజ ఇంధనాలకు, పునరుద్పాదక ఇంధనాలకు మద్దతు ఇవ్వడంతో విధానంపై ధరదే పైచేయి అయింది. కర్బనీకరణను తగ్గించాలన్న ప్రయత్నాలు వెనకపట్టు పట్టాయి. శిలాజ ఇంధనం విషయంలో భారత్ చివరి అతి పెద్ద మార్కెట్‌గా నిలిచింది. శిలాజ ఇంధనంలో దిగ్గజ దేశాల లాబీయింగ్ కారణంగా అవసరం లేని ఇంధనాలను సైతం దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.
సహజ వాయువు వాటా ఎందుకు తగ్గుతోంది ?
2014 వరకూ భారత ఇంధన మిశ్రమంలో సహజ వాయువు వాటా చాలా తక్కువగా ఉండేది. యూరియా తయారీకి అవసరమైన దేశీయ వాయువుకు ఎరువుల కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. దీంతో మిగిలిన వాయువు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు, సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థలు వంటి ఇతర వినియోగదారులకు చేరేది. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలతో పోటీ పడాలంటే గ్యాస్ ఆధారిత ప్రాజెక్టుల ధర ఎక్కువగా ఉండకూడదు. దేశీయ గ్యాస్ ధర తక్కువగానే ఉన్నా అది ఎరువుల కర్మాగారాలకే ఎక్కువగా సరఫరా అయ్యేది. దిగుమతి చేసుకున్న గ్యాస్ ధర చాలా ఎక్కువగా ఉండేది. దేశంలో ఇంధన మిశ్రమంలో సహజ వాయువు వాటా తక్కువగా ఉండడానికి ఇవన్నీ కారణాలే. మరోవైపు దేశంలో గ్యాస్ ఉత్పత్తి మందగిస్తూ వస్తోంది. రిలయన్స్ కేజీడీ-6 బేసిన్ నుంచి ఆశించిన స్థాయిలో గ్యాస్ సరఫరా లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇంధన మిశ్రమంలో సహజ వాయువు వాటాను సుమారు మూడు రెట్లు పెంచాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలంటే గ్యాస్ వినియోగం ఏటా 11 శాతానికి పైబడి పెరగాల్సి ఉంటుంది.
వ్యతిరేకతను పట్టించుకోని ప్రభుత్వం
2019లో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖకు అమెరికాకు చెందిన సంప్రదాయేతర సహజ వాయువు సంస్థ టెల్లూరియన్ నుంచి ఓ ప్రతిపాదన వచ్చింది. తమ రాబోయే ఎల్‌ఎన్‌జీ ఎగుమతి టెర్మినల్‌లో పెట్టుబడి పెడితే, రుణానికి హామీ ఇస్తే 40 సంవత్సరాల పాటు టెర్మినల్‌లో 18 శాతం వాటా ఇస్తానని, ఏటా ఐదు మిలియన్ టన్నుల గ్యాస్‌ను సరఫరా చేస్తానని చెప్పింది. ఈ బలహీన ఆఫర్‌ను పెట్రోనెట్ బోర్డు తోసిపుచ్చింది. నలభై సంవత్సరాల పాటు దిగుమతులను ఎలా నిలిపివేస్తామని ప్రశ్నించింది. గెయిల్, ఐఓసీ, ఓఎన్‌జీసీ సహా పెట్రోనెట్ ప్రమోటర్లు అందరూ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారని తెలిపింది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. 2019లో మోడీ హూస్టన్ పర్యటనకు వెళ్లడానికి ముందు టెల్లూరియన్, పెట్రోనెట్ మధ్య ఒప్పందం ఖరారైంది. భారత స్టాక్ మార్కెట్లు దీనిపై పెదవి విరవడంతో పెట్రోనెట్ షేర్లు పడిపోయాయి.
ఖతార్ సంస్థతో తాజా ఒప్పందం
ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం చాలా ఖరీదైన బేరానికి దిగింది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరి ఉంటే భారత్ 40 సంవత్సరాలలో గ్యాస్ కొనుగోలు కోసం టెల్లూరియన్‌కు అక్షరాలా రూ.6,65,000 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. అయితే టెల్లూరియన్ సంస్థ దివాలా తీయడంతో భారత్‌కు పెద్ద ముప్పు తప్పింది. 2024 డిసెంబరులో ఈ సంస్థ 1.2 బిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. కానీ 2024లో ప్రభుత్వం ఖతార్‌తో ఎల్‌ఎన్‌జీ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది. దీని ప్రకారం 20 సంవత్సరాలలో భారత్ రూ.7,41,000 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక్కడ ఓ విషయాన్ని ప్రస్తావిం చాల్సి ఉంది. దిగుమతి చేసుకునే సహజ వాయువుకు గృహాలు, వాహనాలు, పారిశ్రామిక యూనిట్లు మారడానికి దాని లభ్యత ఒక్కటే సరిపోదు. ఇంధన ధర కూడా తగ్గాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వం గ్యాస్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఆ ఇంధనంపై సబ్సిడీ కూడా ఇవ్వాలి.
బీజేపీకి రాజకీయ లబ్ది
మోడీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రాజకీయంగా బీజేపీ లబ్ది పొందింది. ఖతార్ పెట్రోలియం, చెనియడ్, డొమినియన్ వంటి సంస్థలు లాభాలు మూటకట్టుకున్నాయి. కానీ భారత్ మాత్రం మరో ఇంధనం దిగుమతిపై ఆధారపడాల్సి వచ్చింది. పునరుద్పాదక ఇంధనాలపై కావాల్సినంత పెట్టుబడులు కూడా పెట్టలేకపోయింది.
ట్రంప్ ప్రభుత్వ ఒత్తిడే కారణమా ?
రెండు సంస్థల మధ్య తుది ఒప్పందం కుదరకపోవడంతో ఎంఓయూను పొడిగిస్తూ పోయారు. దానిని మూడుసార్లు రద్దు చేశారు. 2021 డిసెంబరులో పెట్రోనెట్ ఆ ఒప్పందాన్ని తోసిపుచ్చింది. ఎలాంటి పెట్టుబడి అవసరం లేకుండానే ఎల్‌ఎన్‌జీ అందుబాటులో ఉన్నప్పుడు దీని అవసరం ఏముందని ప్రశ్నించింది. 2022లో షెల్, విటోల్ సంస్థలు కూడా టెల్లూరియన్‌తో ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. దీంతో దానికి పెట్టుబడిదారుల అవసరం ఏర్పడింది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం మాత్రం దానికి మద్దతు కొన సాగించింది. ఓ వైపు పారిశ్రామిక దిగ్గజాలు టెల్లూరియన్ మనుగడపై సందేహాలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు మోడీ ప్రభుత్వం ఎందుకు అంత ఉత్సాహం చూపుతోందో అర్థం కాని పరిస్థితి. టెల్లూరియన్ కంపెనీ అమెరికాలో అధికార రిపబ్లికన్ పార్టీకి నిధులు సమకూరుస్తున్నందున ట్రంప్ ప్రభుత్వం ఈ ఒప్పందం కోసం మోడీ సర్కారుపై ఒత్తిడి తెచ్చిందని ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో పనిచేస్తున్న అధికారి ఒకరు ‘ది వైర్’ ప్రతినిధికి చెప్పారు.
పునరుత్పాదకంపై పెట్టుబడులేవి?
- Advertisement -
- Advertisement -



