Tuesday, July 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగగనతల దాడులు ఉధృతం

గగనతల దాడులు ఉధృతం

- Advertisement -

సైనిక స్థావరాలే అమెరికా, ఇరాన్‌ లక్ష్యాలు
గల్ఫ్‌లో దెబ్బతిన్న అమెరికా కేంద్రాలు
(నవ తెలంగాణ – జనరల్‌ డెస్క్‌)

దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా వణికిపోతోంది. అమెరికా, ఇరాన్‌ సేనలు గగనతల దాడులను ఉధృతం చేశాయి. ఇరాన్‌ సైనిక లక్ష్యాలపై అనేక దాడులు చేశామని అమెరికా సైన్యం తెలిపింది. అటు ఇరాన్‌ కూడా గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్‌ దక్షిణ దిశలో అనేక పేలుడు శబ్దాలు వినిపించాయి. మషర్‌ రాష్ట్రంలోని ఓ వాటర్‌ పంపింగ్‌ కేంద్రంపై అమెరికా జరిపిన దాడిలో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోగా నలుగురు గాయపడ్డారు. అమెరికా సేనలు ఆదివారం రాత్రి కొన్ని గంటల పాటు జరిపిన వరుస దాడులకు ప్రతిగా గల్ఫ్‌ దేశాలలోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. బహ్రెయిన్ లోని షేక్‌ ఐసా వైమానిక స్థావరంపై ఇరాన్‌ జరిపిన దాడిలో హెలికాప్టర్‌ నిర్వహణ-మరమ్మతు సౌకర్యాలు, పీ8 పొసైడాన్‌ విమానాలను నిల్వ ఉంచే కేంద్రం, సైనిక డ్రోన్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం దెబ్బతిన్నాయి. ఇరాన్‌ దాడి నేపథ్యంలో పలు ప్రాంతాలలో సైరన్లు మోగించారు. ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని బహ్రెయిన్ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. తమ దేశం వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డకున్నామని కువైట్‌ తెలిపింది. పేలుడు శబ్దాలు వినిపించవచ్చునని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరింది. అధికారుల ఆదేశాలను పాటించాలని సూచించింది. కువైట్‌లోని అలీ అల్‌ సేలంలో ఉన్న అమెరికా స్థావరంపై దాడి చేసి ఇంధన నిల్వ ట్యాంకులను, పాట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) తెలియజేసింది. అహ్మద్‌ అల్‌ జబర్‌ వైమానిక స్థావరంపై కూడా దాడి చేసి ఎఫ్‌పీఎస్‌ రాడార్‌ వ్యవస్థకు నష్టం కలిగించామని చెప్పింది. ఇరాన్‌ ప్రయోగించిన నాలుగు క్షిపణులను గగనతలంలో అడ్డుకున్నామని జోర్డాన్‌ సైన్యం చెప్పింది. ఒమన్‌లోని అమెరికా రాడార్‌ వ్యవస్థపై కూడా ఇరాన్‌ దాడులు చేసింది. మొత్తంగా గల్ఫ్‌లోని ఎనిమిది దేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది.

దక్షిణ, మధ్య ఇరాన్‌ రాష్ట్రాలపై దాడులు
ఇరాన్‌లోని వివిధ ప్రదేశాలలో ఉన్న లక్ష్యాలపై దాడి చేశామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, డ్రోన్లు, సముద్ర డ్రోన్లను ఉపయోగించి ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలు, కోస్తా రాడార్‌ కేంద్రాలు, క్షిపణి-డ్రోన్‌ సామర్ధ్యాలు, చిన్న చిన్న పడవలపై దాడులు జరిపామని వివరించింది. మధ్య, దక్షిణ రాష్ట్రాలపై అనేక దాడులు జరిగాయని, ఈ దాడులలో ఓ వ్యక్తి చనిపోగా అనేక మంది గాయపడ్డారని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా తెలియజేసింది. ఖుజెస్థాన్‌ రాష్ట్రంలోని ఖొర్రంషెహర్‌, హోవెజెహ్ నగరాలలో పేలుడు శబ్దాలు వినిపించాయి. అవజ్‌ నగర సమీపంలోని పలు ప్రాతాలపై కూడా అమెరికా దాడులు చేసింది. బందర్‌ అబ్బాస్‌, ఖెష్మ్‌ దీవిలో పేలుళ్లు సంభవించాయి. బందర్‌ అబ్బాస్‌ ఓడరేవు పట్టణం హార్ముజ్‌ జలసంధి తీరంలో ఉంది. ఖెష్మ్‌ అనేది ఇరాన్‌ ప్రధాన భూభాగానికి సమీపంలోనే ఉన్న దీవి. ఇస్ఫహాన్‌ రాష్ట్రంలో అమెరికా దళాలు జరిపిన దాడిలో ఓ వ్యక్తి చనిపోయాడు.

పెరిగిన చమురు ధరలు
దాడులు, ప్రతి దాడుల కారణంగా బ్రెంట్‌ క్రూడ్‌, యూఎస్‌ క్రూడ్‌ ధరలు సోమవారం మూడు శాతం మేర పెరిగాయి. హార్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై వ్యక్తమవుతున్న ఆందోళనలే చమురు ధరల పెరుగుదలకు కారణం. హార్ముజ్‌లో అమెరికా జోక్యం కొనసాగితే అంతర్జాతీయ చమురు-గ్యాస్‌ రంగంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఇస్లామిక్‌ గార్డులు హెచ్చరించారు. అమెరికా సైనిక జోక్యం నిలిచిపోయినప్పుడే హార్ముజ్‌లో నౌకాయానం సాధారణ స్థితికి చేరుతుందని స్పష్టం చేశారు. తమ అనుమతి లేకుండా నౌకాయానం చేయవద్దని సూచించారు. కాగా యూరప్‌లో జెట్‌ ఇంధన సరఫరాలకు ఆటంకం కలుగుతోంది. ప్రస్తుతం నెల రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. డిమాండ్‌, సరఫరాల మధ్య భారీ వ్యత్యాసం కన్పిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -