ఏకైక టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపు
270 పరుగుల తేడాతో భారీ విజయం
1-0తో టెస్టు సిరీస్ హర్మన్‌సేన వశం
మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మహిళల తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై విజయభేరి మోగించారు. బంతితో యువ పేసర్ క్రాంతి గౌడ ఏడు వికెట్ల ప్రదర్శన చేయగా, యువ బ్యాటర్ యస్టికా భాటియా సెంచరీతో చెలరేగింది. ఇంగ్లాండ్‌పై అన్ని విభాగాల్లో పైచేయి సాధించిన టీమ్ ఇండియా అమ్మాయిలు 270 పరుగుల భారీ తేడాతో ఏకైక టెస్టులో విజయం సాధించారు. 1-0తో టెస్టు సిరీస్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు.
నవతెలంగాణ-లార్డ్స్
ఇంగ్లాండ్, భారత్ మహిళల ఏకైక టెస్టులో టీమ్ ఇండియా అదిరే విజయం సాధించింది. తొలిసారి మహిళల టెస్టుకు చారిత్రక లార్డ్స్ ఆతిథ్యం ఇవ్వగా.. హర్మన్‌ప్రీత్ సేన 270 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. 457 పరుగుల రికార్డు ఛేదనలో ఇంగ్లాండ్ మహిళల జట్టు 62.5 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లు స్నేహ్ రానా (4/42), దీప్తి శర్మ (2/36)కు తోడు పేసర్లు క్రాంతి గౌడ (2/54), సయాలి (2/24) మెరటంతో ఇంగ్లాండ్ అమ్మాయిలు విలవిల్లాడారు. ఆఖరు రోజు ఆటలో గంటన్నర లోపే లాంఛనం ముగించిన భారత్ అతిపెద్ద విజయంతో స్వదేశానికి తిరిగి రానుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్రాంతి గౌడ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. ఏకైక టెస్టులో గెలుపొందిన భారత్ 1-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
స్పిన్‌కు విలవిల
457 పరుగుల రికార్డు ఛేదనలో ఇంగ్లాండ్ మహిళల జట్టు కుప్పకూలింది. టాప్ ఆర్డర్‌లో ఎవరూ భారత బౌలర్లను ఎదురొడ్డి క్రీజులో నిలువలేదు. మయ బౌచర్ (2), టామీ బ్యూమోంట్ (0), హీథర్ నైట్ (13), నటాలీ సీవర్ బ్రంట్ (11), అలిస్ కాప్సే (21) తేలిపోయారు. క్రాంతి గౌడ, సయాలి టాప్ ఆర్డర్‌ను లేపేయగా.. స్పిన్నర్లు స్నేహ్ రానా, దీప్తి శర్మ మిడిల్, లోయర్ ఆర్డర్ సంగతి చూసుకున్నారు. ఆల్‌రౌండర్ ఆమీ జోన్స్ (54, 80 బంతుల్లో 6 ఫోర్లు) , సోఫీ ఎకెలస్టోన్ (50, 66 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో భారత్ విజయాన్ని ఆలస్యం చేశారు.
భాటియా బాదేసింది
భారత బ్యాటర్లలో యస్టికా భాటియా (113, 158 బంతుల్లో 14 ఫోర్లు) సెంచరీతో చెలరేగింది. ఓపెనర్ స్మృతీ మంధాన (70, 130 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), రిచా ఘోష్ (50 నాటౌట్, 52 బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. సెంచరీతో భాటియా లార్డ్స్ హానర్స్ బోర్డుకు ఎక్కగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో క్రాంతి గౌడ సైతం ఆ గౌరవం అందుకున్న సంగతి తెలిసిందే. షెఫాలీ వర్మ (33) మెరువగా.. జెమీమా రొడ్రిగ్స్ (3), దీప్తి శర్మ (10), హర్మన్‌ప్రీత్ కౌర్ (16), స్నేహ్ రానా (1) అంచనాలను అందుకోలేదు. అయినా, 86.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 341 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను బారత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ (5/118) ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
భారత మహిళల తొలి ఇన్నింగ్స్ : 285 /10 (స్మృతీ మంధాన 83, హర్మన్‌ప్రీత్ కౌర్ 58, దీప్తి శర్మ 57, సోఫీ ఎకెల్‌స్టోన్ 3/68, వాంగ్ 2/41)
ఇంగ్లాండ్ మహిళల తొలి ఇన్నింగ్స్ : 170/10 (ఆమీ జోన్స్ 52, నటాలీ సీవర్ 44, క్రాంతి గౌడ 5/37, సయాలి 2/40, స్నేహ్ రానా 2/41)
భారత మహిళల రెండో ఇన్నింగ్స్ : 341/7 డిక్లేర్డ్ (యస్టికా భాటియా 113, స్మృతీ మంధాన 70, రిచా ఘోష్ 50, సోఫీ ఎకెల్‌స్టోన్ 5/118)
ఇంగ్లాండ్ మహిలల రెండో ఇన్నింగ్స్ : 186/10 (ఆమీ జోన్స్ 52, సోఫీ ఎకెల్‌స్టోన్ 50, స్నేహ్ రానా 4/42, క్రాంతి గౌడ 2/54, సయాలి 2/24)
లార్డ్స్‌లో అమ్మాయిల నవ చరిత్ర
- Advertisement -
- Advertisement -



