ఎక్సైజ్‌ శాఖలో ఏం జరుగుతోంది?

What is happening in the excise department?– గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిణామాలపై సీఎం ఆగ్రహం
– సంబంధిత మంత్రికి తెలియకుండానే అనుమతులిస్తున్నారా?
– నిలిపేసిన సోమ్‌, టోయిట్‌ కంపెనీలకు అనుమతులు
– ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సర్కార్‌ ఆందోళన
– నేడు ఆబ్కారీశాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి లిక్కర్‌ షాపులకు అనుమతులివ్వ లేదని ఆబ్కారీ శాఖ మంత్రి గత నెలలో ప్రకటించారు. మంత్రి ప్రకటించిన వారం రోజులకే మధ్యప్రదేశ్‌కు చెందిన సోమ్‌ డిస్టిలరీ, మౌంట్‌ ఎవరెస్ట్‌, కర్ణాటకకు చెందిన టోయిట్‌, హైదరాబాద్‌కు చెందిన ఎక్సాటికాతోపాటు మరో కంపెనీకి రాష్ట్రంలో బీర్ల సరఫరాకు అబ్కారీ శాఖ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ప్రతి పక్షాలతోపాటు స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటి అనుమతులను తాత్కాలికంగా హౌల్డ్‌లో పెట్టారు. తెలంగాణ కంపెనీలను కాదని కమీషన్ల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం డిస్టలరీలకు అనుమతులిస్తున్నారని దుమారం చేలరేగడంతో మఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా అబ్కారీ శాఖలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్వయంగా ఆ శాఖ మంత్రికే తెలియకుండా విధాన పరమైన నిర్ణయాలు జరిగిపోతున్నాయనే ప్రచారం నెలకొంది.. కొత్త బ్రాండ్లకు అనుమతులిచ్చే తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రభుత్వానికి తెలియకుండానే ఇతర రాష్ట్రాల కంపెనీలను ప్రవేశ పెడుతున్నదా? ఇందులో ఎవరి ప్రమేయముంది? ఎందుకు చేస్తున్నారు? అంటూ ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలోని ఓ వర్గం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అనుమతులు పొందిన సదరు కంపెనీలపై దేశ వ్యాప్తంగా అనేక ఆరోపణలున్నాయనీ, రాష్ట్రాల ఖజానాలకు గండికొడుతూ, ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకొని ఎగ్గొడుతూ, కల్తీ మద్యం వ్యాపారం చేశాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సదరు కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలనే డిమాండ్‌ సర్వత్రా వ్యక్తమైంది. నిబంధనల మేరకే సోమ్‌ డిస్టిలరీ కంపెనీకి మద్యం సరఫరా చేసేందుకు అనుమతిచ్చామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. డిమాండ్‌, సప్లరును బట్టి కొత్త కంపెనీలకు బెవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అనుమతులను మంజూరు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. అప్పటికే జరగరాని నష్టం జరిగి పోయింది. మద్యం విషయంలో గత సర్కార్‌ దారిలోనే కాంగ్రెస్‌ నడుస్తున్నదనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది.
ఈ నేపథ్యంలో అబ్కారీ శాఖలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. శాఖా పరంగా ఎక్సర్‌సైజ్‌ చేయకుండా తొందరపడి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని అక్షింతలు వేయడంతో కొత్త కంపెనీలకు ఇచ్చిన అనుమతులను నిలిపేసారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. వివాదానికి పుల్‌ స్టాప్‌ పెట్టేందుకు శుక్రవారం అబ్కారీ శాఖపై సమీక్ష చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. వీటితో పాటు నాటు సారా తయారీ, అక్రమ రవాణాను అరికట్టడం, కొత్త పాలసీ రూపకల్పన, మద్యం అమ్మకాలను మరింతగా పెంచడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Spread the love