ఏమున్నది గర్వకారణం..

‘పేదవాడు తినటానికి తిండి, కట్టుకోవటానికి గుడ్డ, ఉండటానికో గూడు… వీటిని నెరవేర్చటం ప్రభుత్వాల కనీస బాధ్యత…’ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కమ్యూనిస్టు అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిన మాటలివి. కూడు, గూడు, గుడ్డ అనేవి ఆనాటి నుంచి ఈనాటి వరకూ పార్టీల నినాదాలుగానే ఉన్నాయి తప్పితే వాటి విధానాల్లో ఎలాంటి మార్పూ రాలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌లో సైతం విత్తమంత్రి నిర్మలమ్మ మరోసారి పేదరికం గురించి నొక్కి వక్కాణించారు. ‘పేదరికం లేని భారతే మా లక్ష్యం…’ అంటూ మంత్రిగారు మరోసారి పార్లమెంటులో బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ ఆ పేదరికాన్ని రూపుమాపేందుకు ఎలాంటి చర్యలు చేపడతారు.. అందుకోసం ఎన్ని నిధులు కేటాయి స్తారనే దానిపై మాత్రం ఆమె నోరు మెదపలేదు. ఒకవైపు దేశంలో కార్మికులు, శ్రామికులు, కష్టజీవుల రోజువారీ వేతనాలు భారీగా పడిపోతున్నాయి. వచ్చే ఆదాయానికీ, పెరుగుతున్న ఖర్చులకు పొంతనే లేకుండా పోతోంది. మరో వైపు అంబానీలు, అదానీలు తమ పిల్లల పెండిండ్ల కోసం వేల కోట్ల రూపాయలను ధారాళంగా ఖర్చు పెడుతున్నారు. కష్టజీవులంతా పని చేసి సంపద పోగేస్తే… అది కొద్ది మంది చేతుల్లోనే ఉండిపో తోంది. ఈ నేపథ్యంలో… ‘ఏ బడ్జెట్‌ చూసినా ఏమున్నది గర్వకారణం… పద్దుల్లో రాయితీలన్నీ పెద్దలమయం… సామాన్యుడికి తప్పదు కష్టాల కాపురం…’ అని దీనంగా పాడుకోవాల్సి వస్తోంది.
– బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love