Wednesday, August 19, 2026
E-PAPER
Homeజాతీయంపీఎం కేర్స్ ఫండ్ ఏం చేస్తున్నారు?

పీఎం కేర్స్ ఫండ్ ఏం చేస్తున్నారు?

- Advertisement -

దాదాపు రూ.8,452 కోట్ల నిధులు జమ
2025లో కేవ‌లం రూ.88 ల‌క్ష‌లే ఖ‌ర్చు..ఆడిట్‌లో పలు అంశాలు వెలుగులోకి
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

క‌రోనా స‌మ‌యంలో దేశంలోని పీఎం కేర్స్ ఫండ్ భారీ మొత్తంలో సేక‌రించారు. ఈ నిధిని చిన్నారులకు స‌హాయం, ప్ర‌జారోగ్యం, ప్ర‌కృతి వైప‌రీత్యాలు వంటి వాటికి ఖ‌ర్చు చేయాల్సి ఉంది. కానీ కేంద్ర ప్ర‌భుత్వం ఆ ర‌కంగా ఖ‌ర్చు చేయ‌టం లేదు. ఈ ఫండ్‌ కోట్ల‌లో ఉండ‌గా, ఖ‌ర్చు మాత్రం కేవ‌లం ల‌క్ష‌ల్లోనే ఉంది. పీఎం కేర్స్ ఫండ్ తాజా ఆడిట్ లోని రాబ‌డి, చెల్లింపుల వివరాల ప్ర‌కారం 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసే నాటికి రూ.8,452.07 కోట్ల నిల్వ‌లు ఉన్నాయి. ఇది అంత‌కు ముందు ఏడాది రూ. 7,173.03 కోట్ల నిల్వ‌ల కంటే ఎక్కువ‌గా న‌మోదు అయింది.
అయితే 2025లో ఈ ఫండ్‌లో కేవ‌లం రూ.87.85 ల‌క్ష‌లు మాత్ర‌మే కేంద్రం ఖ‌ర్చు చేసింది. ఇది 2023-24లోని రూ.15.60 కోట్ల నుంచి గ‌ణ‌నీయంగా త‌గ్గింది. 2025లో రూ.87.84 ల‌క్ష‌లు చిల్డ్ర‌న్ స్కీమ్‌కు కేటాయించ‌గా, రూ.451 బ్యాంకు, ఎస్ఎంఎస్ ఛార్జీలకు ఖర్చు చేశారు. 2025 మార్చి 31తో ముగిసిన సంవ‌త్స‌రానికి సంబంధించిన ఖాతాల‌పై 2026 ఆగ‌స్టు 6న ఫండ్‌ సంబంధిత అధికారులు, ఆగ‌స్టు 7న చార్ట‌ర్డ్ అకౌంటెంట్ సంతాకాలు చేశారు.
రూ.8,452.95 కోట్ల‌లో రూ.7,846.65 కోట్లు షెడ్యూల్డ్ బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో ఉండ‌గా, మ‌రో రూ.604.41 కోట్లు బ్యాంకు పొదుపు ఖాతాల్లో ఉన్నాయి. దేశీయ విరాళాల రూపంలో 2025 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.479.05 కోట్లు అంద‌గా, అంత‌కు ముందు ఏడాది ఇది రూ. 681.81 కోట్లు అందింది. 2024 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.1.14 కోట్లుగా ఉన్న విదేశీ విరాళాలు, 2025లో రూ.92.83 ల‌క్ష‌లు న‌మోదు అయ్యాయి.

వడ్డీ మ‌రో ప్ర‌ధాన ఆదాయ వ‌నరుగా నిలిచింది. ఈ ఏడాదిలో ఈ ప‌థ‌కం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రూపంలో రూ.469.38 కోట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.5.77 కోట్లు ఆర్జించింది. ఇది అమ‌లు చేసే ఏజెన్సీల నుంచి రీఫండ్‌ల రూపంలో రూ.324.66 కోట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీపై మిన‌హాయించిన ప‌న్ను రీఫండ్‌గా రూ.13.49 ల‌క్ష‌లు పొందింది.
క‌రోనా స‌మ‌యంలో పీఎం కేర్స్ ఫండ్ 2020 మార్చిలో ఏర్పాటు చేశారు. అదే ఏడాది మార్చి 27న న్యూఢిల్లీలో ట్ర‌స్ట్ డీడ్ రిజిస్ట‌ర్ చేశారు. ప్ర‌జారోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు, ప్ర‌కృతి వైప‌రీత్యాలు లేదా మాన‌వ నిర్మిత విప‌త్తులు, ఇత‌ర క్లిష్ట ప‌రిస్థితుల్లో స‌హాయం అందించ‌డానికి ఈ నిధిని ఒక ప్ర‌త్యేక యంత్రాంగంగా రూపొందించారు. దీని ల‌క్ష్యాలు ఆరోగ్య సంర‌క్ష‌ణ మౌలిక స‌దుపాయాలు, ఔష‌ధ సౌక‌ర్యాలు, ప‌రిశోధ‌న‌, ప్ర‌భావిత ప్ర‌జల‌కు ప్ర‌త్య‌క్ష ఆర్థిక స‌హాయం కోసం నిధుల‌ను కూడా అందించాలి. దీనికి ప‌దవీ రీత్యా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ చైర్మ‌న్‌గా, కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ట్ర‌స్టీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరే కాకుండా సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కెటి థామ‌స్‌, కేంద్ర మాజీ మంత్రి క‌రియా ముండా నామినేటెడ్ ట్ర‌స్టీలుగా ఉన్నారు. ట్ర‌స్ట్ స‌హాల మండలిలో మాజీ కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ రాజీవ్ మెహ్రిషి, సుధామూర్తి, ఆనంద్ షా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -